ఆముదం తాగ‌మ‌న్న పూరి జ‌గ‌న్నాథ్

August 13, 2020

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు ఆదివారం చేప‌ట్ట‌నున్న జ‌న‌తా క‌ర్ఫ్యూపై జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సెల‌బ్రెటీలు గ‌ట్టిగానే న‌డుం బిగించారు. జ‌నాల్ని జాగృతం చేసేలా ఎవ‌రి స్ట‌యిల్లో వాళ్లు వీడియోలు చేసి ట్విట్ట‌ర్లో షేర్ చేస్తున్నారు. అగ్ర ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఈ బాట‌లోనే న‌డిచాడు. ఐతే సినిమాల్లో షార్ప్ డైలాగులు రాసే పూరి.. జ‌న‌తా క‌ర్ఫ్యూ విష‌యంలో ఇచ్చిన‌ సందేశంలోనూ త‌న మార్కు చూపించాడు. నేను ఇంట్లో ఉండలేను అని నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లు.. ఆముదం తాగండి అంటూ ఆయన సలహా ఇవ్వ‌డం విశేషం. త‌న వీడియో సందేశంలో పూరి ఇంకా ఏమ‌న్నాడంటే..
‘‘ఎందుకు చెప్పారో.. మన ప్రధానమంత్రి గారు చెప్పిన మాట విందాం. ఆదివారం అందరం ఇంట్లోనే ఉందాం. ఇలా ఉంటే ఆ కరోనా వైరస్ తాలూకు చైన్ కట్ అవుతుందని పెద్దలందరి అభిప్రాయం. సో.. వారి మాటను గౌరవించి ఇంట్లోనే ఉందాం. ఇవాళ కరోనా లేని ప్లేస్‌లోకి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే.. ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఏంటంటే వూహాన్. చైనాలో కరోనా వస్తే.. కంట్రీ మొత్తం కట్టగట్టుకుని కరోనాని చావకొట్టారు. సో.. మనం కూడా ఆ పని చేయాలనుకుంటే.. చెప్పిన మాట వినండి. కొంత మంది నేను ఇంట్లో ఉండలేను అని నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకి, ఫ్రస్టేట్ అయ్యేవాళ్లకి నా సలహా ఏమిటంటే.. ఆదివారం ఉదయం లేవగానే నాలుగు స్ఫూన్లు ఆముదం తాగండి. మోషన్స్ అవుతాయి. ఇక ఆ పనిలో బిజీగా ఉంటారు. సాయంత్రం అయిపోతది. హ్యాపీగా ఉంటది. సో.. ఇలాంటి టైమ్‌లో నెగిటివ్‌గా లేకుండా చెప్పిన మాట వినండి. రేపందరూ ఇంట్లోనే ఉండండి. లవ్ యు ఆల్..’’ అని పూరి ముగించాడు.