పూరీకి నచ్చలేదు... ఆ టైటిల్ తీసిపడేశాడు

August 08, 2020

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న కొత్త చిత్రానికి ముందు నుంచి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మీడియా వాళ్లతో సహా అందరూ ఆ సినిమా టైటిల్ ‘ఫైటర్’ అన్నట్లే రాస్తున్నారు. మాట్లాడుకుంటున్నారు. ఐతే ‘ఫైటర్’ అనేది ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. సినిమాలో అది కొనసాగదని అంటోంది ఈ చిత్ర సహ నిర్మాత ఛార్మి కౌర్.

ఈ చిత్రానికి అదిరిపోయే వేరే టైటిల్ పెట్టామని.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉంటుందని.. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఆగామని.. మళ్లీ చిత్రీకరణ ఆరంభమయ్యాక మంచి ముహూర్తం చూసుకుని టైటిల్ వెల్లడిస్తామని ఛార్మి చెప్పింది.

ఇక ఈ చిత్ర విశేషాల గురించి చెబుతూ.. సినిమా అంతటా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.. దానికి తోడు సెంటిమెంటు సీన్స్ కూడా ఉంటాయని.. తల్లీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉండి ప్రేక్షకులను కదిలిస్తాయని ఛార్మి చెప్పింది.

కథ రీత్యా చాలా వరకు ముంబయిలోనే సన్నివేశాలు నడుస్తాయని.. అందుకే అక్కడే ఎక్కువ భాగం చిత్రీకరణ చేశామని.. ఇక ముందూ అక్కడ చేయాల్సిన కంటిన్యుటీ సీన్స్ చాలా ఉన్నాయని.. అలాగే విదేశీ ఫైటర్లు కూడా చాలామంది చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉందని.. అందువల్ల మామూలు పరిస్థితులు నెలకొనే వరకు చిత్రీకరణ పున:ప్రారంభించే అవకాశాలు లేవని ఛార్మి వెల్లడించింది.

ఈ కథను పూరి జగన్నాథ్ కేవలం విజయ్ దేవరకొండను దృష్టిలో ఉంచుకునే రాశారని.. ఇంకెవరి దగ్గరికీ ఈ కథ వెళ్లలేదని.. విజయ్ కూడా కథ విన్న వెంటనే ఎగ్జైట్ అయి ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని ఛార్మి వెల్లడించింది.