అది టీడీపీ కుట్ర కాదమ్మా... నీ చరిత్ర

July 01, 2020

ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఎస్టీ అని ఎన్నికల అఫిడవిట్లో పెట్టి... ఎన్నికల సంఘాన్ని మోసం చేసిందంటూ ఒక సంచలన ఫిర్యాదు, ఆరోపణ నమోదైంది. ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్, ఆలిండియా దళిత హక్కుల సంఘం ఏపీ చీఫ్ మణి సింగ్ ఆరోపించారు. కేవలం ఆరోపణలతో ఆగలేదు. ఈ విషయమై ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్పశ్రీవాణి కొండదేవర తెగకు చెందిన వ్యక్తి కానే కాదని వారు వాదిస్తున్నారు. ఆమె గిరిజన మహిళ కాదంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల అఫిడవిట్ లో పుష్పశ్రీవాణి పేర్కొన్నవి అఅబద్ధం అని వారు ఆరోపించారు.

జగన్ కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా... పాముల పుష్ప శ్రీవాణి అందులో ఒకరు. ఆమెపై కుల వివాదం మొదలైంది. ఎస్టీ కేటగిరీకి చెందిన వ్యక్తిని అని పుష్ప శ్రీవాణి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి 2014,2019 లో ఆమె వరుసగా గెలిచారు. ఒక యువతి... వరుసగా రెండు సార్లు గెలవడం అసాధారణ విషయంగా భావించిన జగన్ ఆమెకు ఉప ముఖ్యమంత్రిపదవి ఇచ్చారు.  ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం సలహాదారు రేగు మహేశ్, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్ లు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు పుష్పశ్రీవాణిపై ఫిర్యాదు చేశారు.

దీనిపై పుష్ప శ్రీవాణి చాలా వేగంగా స్పందించడం విశేషం. ఇది కొత్త వివాదం కాదని కొట్టిపారేశారు. కుట్ర అన్నారు. టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులే తనపై ఈ తరహా నిందలేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గత 11 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోందని, గతంలో పలు పర్యాయాలు ఇలాగే ఆరోపణలు చేశారని, న్యాయం తన పక్షానే నిలిచిందని ఆమె చెప్పారు.