పుతిన్ రాజాకు కరోనా వస్తుందా?

June 06, 2020

ప్రపంచమంతా కరోనా దెబ్బకు కలుగులోకి దూరిపోయినా ఆ ప్రభావం ఇంకా పడలేదని చెప్పుకొంటున్న దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఇంట్లో ఉంటారా... లేదంటే బయటకొచ్చి జైలుకెళ్తారా అంటూ ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తన దేశ ప్రజలకు వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ లాక్ డౌన్ పక్కాగా అమలవుతూ కరోనా కట్టడైందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే ప్రపంచంలోని అనేక దేశాల అధ్యక్షులు, వారి భార్యలు, రాజులు, రాణులు కూడా కరోనా బారిన పడుతున్న వేళ పుతిన్‌కు ఏమైనా కరోనా వచ్చే ఆస్కారముందా అన్న చర్చ ఒకటి జరుగుతోంది. అందుకు కారణం ఇటీవల ఆయన్ను కలిసిన డాక్టరుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడమే.
అవును... గతవారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ను కలిసిన ఒక వైద్యుడికి కరోనా వైరస్ సోకడంతో రష్యాలో కలకలం రేగింది. మాస్కోలోని ఓ ఆసుపత్రికి కరోనా స్పెషల్ హాస్పిటల్ గా మార్చగా, పుతిన్ దాన్ని సందర్శించారు. పుతిన్ వచ్చిన సమయంలో ఆసుపత్రి చీఫ్‌ గా పనిచేస్తున్న డెనిస్‌ ప్రాట్సెంకొ ఆయనతో పాటే ఉండి, అక్కడి వసతులు, మౌలిక వనరులు తదితరాలను గురించి వివరించారు. తాజాగా, డెనిస్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.  ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాయి అక్కడి అధికార వర్గాలు.
అయితే... పుతిన్ ఆయన్ను కలిసేటప్పటికి హజ్మత్ సూట్ ధరించి ఉన్నారట. హజ్మత్ సూట్ ఉంటే ఎలాంటి వైరస్‌లు దరిచేరవు. అంతేకాదు.. ఆ తరువాత పుతిన్‌కు ఆరోగ్య పరీక్షలు కూడా జరిగాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రబుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు రష్యాలోని, రష్యా బయట ఉన్న పుతిన్ వీరాభిమానులు కూడా కరోనా పుతిన్‌ను ఏమీ చేయలేదని చెబుతున్నారు. మిగతా ప్రపంచ దేశాల అధినేతల్లా కాకుండా పుతిన్ మంచి దేహదారుఢ్యం ఉన్న నాయకుడని.. నిత్యం కఠోర వ్యాయామం చేస్తారని.. దానివల్ల ఆయనకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందని.. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారిని కరోనా ఏమీ చేయలేదని అంటున్నారు.