ఇదీ బాబు టీం... పార్టీ కోసం వియ్యంకుడినే ఉతికారేశాడు

July 21, 2019

రాజకీయ నాయకుడికి పార్టీ అంటే కన్నతల్లి వంటిది. స్వార్థం కొంతవరకు పర్లేదు గానీ... పార్టీని గాలికొదిలి స్వార్థమొక్కటే చూసుకుంటే రాజకీయ నాయకుడి పతనం మొదలైనట్లే. దీనిని స్పష్టంగా అర్థం చేసుకుని, పార్టీ విధేయతను జవదాటని పుట్టా సుధాకర్ యాదవ్ని చూసి రాజకీయ నేతలు ఆశ్చర్య పోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... తెలుగుదేశం పార్టీలో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్... తన వియ్యంకుడు అయిన తలసానిని ఉతికారేశాడు. 

దొడ్డిదారిన వైకాపాకు మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్ జగన్ కి మేలు చేయడం కోసం సకల ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఒకటి జగన్ తరఫున బీసీలను దువ్వడం. బీసీలు తెలుగుదేశానికి పునాదులు. అయితే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ... బీసీలకు తెలుగుదేశం ఏం చేయలేదని ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాదు... అసలు ఆంధ్రాలో బీసీ నాయకులే లేరన్నట్టు తానొచ్చి నాయకత్వం వహించాలని తెగ ముచ్చటపడుతున్నాడు. అయితే... తలసాని టీడీపీ పైనా, తన బాస్ పైనా విమర్శలు చేస్తుంటే ఓ దశ వరకు ఓపిక పట్టిన సుధాకర్... తాజాగా తలసానిని వియ్యంకుడు అని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు. 

బీసీల వంచనకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్. వారికి అన్యాయం చేసిన వైఎస్ కుటుంబం గురించి తలసాని ఒక్కసారి కూడా ఎందుకు నోరు మెదపట్లేదని పుట్టా ప్రశ్నించారు. బీసీల మీద ప్రేమ ఉన్న తలసాని బీసీలను మోసం చేసిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం వంచన కాదా అని ప్రశ్నించారు. అంతేకాదు.. తెలంగాణలో అడుగడునా బీసీలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా, కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడం కోసం జగన్‌ను తలసాని వెనకేసుకొస్తున్నారని పుట్టా తీవ్రంగా విమర్శించారు. బీసీలంటే కేసీఆర్ కు ఓటు బ్యాంకు. తెలుగుదేశానికి పునాదులు. అందుకే బీసీ నాయకత్వంతో బీసీల పార్టీ అయ్యింది తెలుగుదేశం అని ఆయన వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ నాయకులు వైసీపీకి అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి టీఆర్ఎస్ కు కంటగింపుగా ఉందన్నారు. మీ నాయకుడు కేసీఆర్‌కు అభివృద్ధిలో చంద్రబాబే మార్గదర్శనం అని... బాబు సీఎం గా ఉంటే... పోటీ పడలేమనే జగన్కు మద్దతు ఇస్తున్నారు అంటూ కేసీఆర్ ముసుగు గురించి పుట్టా వ్యాఖ్యలు చేశారు. తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఏకంగా వార్నింగ్ ఇచ్చారు పుట్టా. ఏపీలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు.