పీవీ చేసిన తప్పును బయటపెట్టిన మన్మోహన్

August 07, 2020

అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత విషయంలో ప్రధానిగా వ్యవహరించిన పీవీ నరసింహరావు పెద్ద తప్పే చేశారని పలువురు ఆరోపిస్తుంటారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి నిందిస్తుంటారు కూడా. అయితే.. సున్నితమైన విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదన్న పీవీ మార్క్ స్టైల్ తోనే ఆయన ఇలాంటి నిందలు మోయాల్సి వచ్చిందన్న నిజం తాజాగా వెలుగు చూసిన వైనం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
ప్రధానిగా వ్యవహరించిన దివంగత ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన మన్మోహన్ సింగ్ ఆసక్తికర అంశాల్ని బయటపెట్టారు. 1984 సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో నాటి కేంద్ర హోంమంత్రిగా వ్యవహరించిన పీవీ కనుక మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహా మేరకు వ్యవహరించి ఉన్నట్లయితే అల్లర్లు జరిగి ఉండేవి కావన్న సంచలన నిజాన్ని వెల్లడించారు.
అల్లర్లు జరిగిన రోజున ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ ఇంటికి వెళ్లారని.. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని ఆయనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోం మంత్రి పీవీకి చెప్పారని.. ఆ సూచనను పీవీ కాని పాటించి ఉంటే అల్లర్లు చాలా వరకూ జరిగి ఉండేవి కావన్నారు.
తాను.. గుజ్రాల్ ఒకే ఊళ్లో జన్మించామని.. రాజకీయాల్లో చాలా సంవత్సరాలు కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మన్మోహన్. ఇంతకాలం పీవీ ఫెయిల్యూర్స్ లో అయోధ్య ఎపిసోడ్ ను మాత్రమే ప్రస్తావించేటోళ్లు.. ఇకపై ఈ అంశాన్ని కూడా కోట్ చేస్తారని చెప్పక తప్పదు.