పీవీ నరసింహారావుకు - సత్య నాదెళ్లకు సంబంధం ఏంటి? 

August 15, 2020

పీవీ నాదెళ్ల అపార మేధావి, బహుముఖ ప్రజ్జాశాలి. కానీ అంత మహానుభావుడికి కించిత్ గర్వం కూడా లేదు అని చెప్పుకోవడానికి సత్య నాదెళ్ల జీవితంలోని ఒక ముఖ్య ఘట్టం ఉదాహరణ. ఇదేందిది పీవీ నరసింహారావు, సత్య నాదెళ్లకు సంబంధం ఏంటి... పైగా ఆయన నిరాడంబరతకు, అణుకువకు అతనికంటే చిన్నవాడైన సత్య నాదెళ్ల జీవితానికి లింకేంటి? మీకే కాదు...  ఈ సంగతి సత్య నాదెళ్ల కూడా మరిచిపోయి ఉండొచ్చు.

సత్య నాదెళ్ల భార్య అనుపమ. ఆమె తండ్రి వేణుగోపాల్  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. పదేళ్ల పాటు ఈయన పీవీ వద్దనే పనిచేశారు. ముఖ్యమంత్రి హోదాలోఉన్నపుడు, ప్రధానిగా ఉన్నపుడు అక్కడ ఇక్కడ పనిచేశారు. 1967 నుంచి పీవీతో ఆయనకు పరిచయాలున్నాయి. పీవీ సొంత జిల్లా అయిన పాత వరంగల్ జిల్లాకు ఈయన కలెక్టరుగా పనిచేశారు.

‘‘పీవీ పేదల పక్షపాతి అనే విషయం అందరికన్నా నాకు బాగా తెలుసు. ఎందుకంటే... ఆయన నన్ను సంక్షేమ శాఖ డైరెక్టరుగా నియమించి తాను పేదలకోసం చేయాల్సిన పనులన్నీ పట్టుదలగా చేయించారు’’ అని వేణుగోపాల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

1991లో ప్రధాన అయ్యాక వేణుగోపాల్ ను తన కార్యదర్శిగా నియమించుకుని అంతర్జాతీయ కార్యక్రమాలకు కూడా తీసుకెళ్లేవారట ప్రధాని పీవీ నరసింహారావు. తనంటే పీవీ గారికి అంత అభిమానం అంటున్నారు వేణుగోపాల్. ఈ సందర్భంగా.. పీవీ నిరాడంబరత, వినయశీలత్వం ఎంత గొప్పవో వివరించే ఒక సంఘటన వేణుగోపాల్ జీవితంలో జరిగిందట.

అదేంటంటే... తన కూతురు అనుపమకు వరుడిగా సత్య నాదెళ్లను ఎంపిక చేశారు. నిశ్చితార్థం పెట్టుకున్నారు. పెళ్లికి పిలుద్దాం పెద్దవాళ్లని అని నిశ్చితార్థానాకి బంధువులనే పిలిచారట. ఈ విషయం తెలిసిన పీవీ నరసింహారావు పిలవకుండా వెళ్లి వధూవరులను ఆశీర్వదించారట. ఆయన్ను పిలవనందుకు వేణుగోపాల్ బాగా ఫీలయ్యారట. కానీ పీవీ ఏ కోశానా దాని గురించి పట్టించుకోలేదట. సమయం కుదిరింది కదా బాగా తెలిసిన వ్యక్తి  ఇంట శుభకార్యం జరుగుతుంటే వచ్చాను అన్నారట పీవీ గారు. 

అసలు నేటి నాయకులు అయితే ఇలా చేయగలరా? ఐఏఎస్ అధికారులను తమ పనోళ్లుగా చూస్తున్నారు నేటి నాయకులు. కానీ పీవీ వంటి వారు ప్రధానులు అయినా ఐఏఎస్ అధికారుకులకు ఎంతో గౌరవం ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ విషయం సత్యనాదెళ్లకు గుర్తుండకపోవచ్చు. గుర్తుంటే ఆయన కచ్చితంగా ఒక ట్వీట్ వేసే వారేమో మరి. పీవీ సాధారణ మనిషి కాదు కదా... సత్య నాదెళ్ల వంటి వారు అలాంటి ఉన్నత టెక్నాలజీ పదవుల్లో ఉన్నారంటే పీవీ గారి సంస్కరణలు కూడా కారణమే.