జై పారాసిటమల్ ... అన్నది ఒక ఐఏఎస్ అధికారి

June 01, 2020

ప్రపంచం మొత్తం వణికిపోతున్న కరోనా వైరస్ కు చెక్ చెప్పేందుకు పెద్ద మందులేమీ అక్కర్లేదని.. పారాసిటమాల్ మాత్ర సరిపోతుందంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వైరస్ చనిపోవటానికి బ్లీచింగ్  చల్లి నాలుగు గంటలు ఆగితే చాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. ఎటకారాలు ఏ స్థాయిలో చోటు చేసుకున్నాయో తెలిసిందే.
కరోనాకు చెక్ పెట్టేందుకు పారాసిటమాల్ సరిపోతే.. ప్రపంచమంతా ఇంత ఆగమాగం కావాల్సిన అవసరమేముంది? అంటూ ప్రశ్నించినోళ్లు లేకపోలేదు. ఇక.. వైద్యులు సైతం.. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్ని తప్పుదారి పట్టేలా చేయటమే కాదు.. కరోనాకు సంబంధించిన వ్యాధి లక్షణాలు కనిపిస్తే దాచి పెట్టే వీలుందని.. అదే జరిగితే మరింత ప్రమాదమని చెబుతున్నోళ్లు లేకపోలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ముందు తన బాస్ జగన్ నోటి నుంచి వచ్చిన మాటల్ని కాస్త అటు ఇటుగా మాట్లాడి.. కరోనాకు పారాసిటమాల్ కు మించిన మందు లేదన్న వాదనను వినిపించటం విశేషం.
కరోనా సోకిన వందమందిలో ఎనభై మంది విశ్రాంతి తీసుకొని సరైన మెడికేషన్ తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు. అలాంటివారు 650 ఎంజీ పారాసిటమాల్ మాత్రలు ఆరు గంటలకు ఒకసారి చొప్పున వేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఈ వ్యాధి నయమవుతుందన్నారు. 102 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం ఉన్నవాళ్లు.. దగ్గు ఎక్కువగా ఉన్నోళ్లు.. ఊపిరి తీసుకోవటంలో కష్టమయ్యే వాళ్లు మాత్రమే ఆసుపత్రికి వెళ్లాలన్నారు. తానో వైద్య అధికారిగా.. మెడికల్ ఎక్ పర్ట్ గా ఈ విషయాల్ని చెబుతున్నట్లు చెప్పారు.
కరోనాకు చెక్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇద్దరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందన్న ఆయన.. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దేశంలో అందరి కంటే ఎక్కువ ఐసోలేషన్ వార్డులు ఎక్కువగా ఏర్పాటు చేసింది తామేనని చెప్పారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారి వివరాల్ని ముందుగానే సేకరిస్తున్నామని..వారి ఇంటికి వెళ్లి.. చికిత్స చేస్తామని పేర్కొన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన పారాసిట్ మాల్ మాటను ప్రస్తావించిన వైనం మరోసారి కలకలాన్ని రేపుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ సమాజాన్ని ఎలా తప్పుదారి పట్టించాడో ఈ వీడియో చూడండి