మన సింధు ... ఇపుడు ప్రపంచ ఛాంపియన్

August 08, 2020

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు అందరి అంచనాలను నిజం చేస్తూ భారతీయుల కలలను నిజం చేసింది. బ్యాడ్మింటన్ క్రీడలో సరికొత్త చరిత్ర సృష్టించింది. స్విట్జర్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఆమె ఘన విజయం సాధించింది. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో సింధు ఘనవిజయం సాధించింది.
తొలి రౌండ్‌లో అదరగొట్టిన పీవీ సింధు రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లడంతో అప్పటికే గుడ్ న్యూస్ ఖాయమని అందరూ అనుకున్నారు. రెండో గేమ్‌లోనూ మొదటి నుంచి పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. 2- నుంచి - 9 పాయింట్ల వరకు చెలరేగి ఆడింది. సింధు జోరును ఒకుహర ఆపలేకపోయింది. విరామానికి 11-4తో అదరగొట్టిన సింధు ఎట్టకేలకు పోరాటపటిమతో అదే జోరు ఛాంపియన్ గా నిలిచింది.
ఇప్పటికే ఐదు సార్లు మనకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్ షిప్ ను సింధు సాధించేసింది. ఈ బంగారు పతకాన్ని సాధించడంతో సింధు విజయం చిరస్మరణీయం అయ్యింది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు కాంస్యాలు, మరో రెండు రజతాలు సాధించారు సింధు. ఈ విజయంతో సింధు 2017లో తనను ఓడించిన ఒకుహరపై ఆమె ప్రతీకారం సాధించినట్లయ్యింది.