తిక్క కుదరలాంటే.. అక్కడలాగా ముఖానికి స్టాంపేయాలట

August 06, 2020

ప్రపంచాన్ని కరోనా కార్చిచ్చు ఎంతలా దహించి వేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఉత్పాతం నుంచి ప్రపంచం ఎప్పటికి కోలుకుంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఆ మాటకు వస్తే.. ఇప్పుడు ఆ ఆలోచన కంటే కూడా.. పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడటం ఎలా అన్న దాని మీదే అందరి ఆలోచనలు నిలిచిఉన్నాయి. ఎవరికి వారు తమ మీద విరుచుకుపడే కరోనాను కంట్రోల్ చేయటానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటివేళ.. ప్రభుత్వం.. అధికారుల ప్రయత్నాల్ని దెబ్బ తీసేలా.. వారి కష్టం నీరుకారేలా కొందరు ప్రవర్తిస్తున్న తీరును పరమ దుర్మార్గంగా ఉంది.
ఇవాల్టి రోజున కరోనా దేశంలో కానీ.. రెండు తెలుగురాష్ట్రాల్లో ఉందంటే కారణం.. అందుకు విదేశాల నుంచి వచ్చిన వారే. ఇలాంటి వారు తగిలించుకు వచ్చిన ఈ వైరస్ వారితో ఆగితే సరిపోతుంది. కానీ.. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం.. పరిమితుల్ని పట్టించుకోకుండా స్వీయ నిర్బందాన్ని పాటించకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న వారి చేతికి ముద్ర వేస్తున్నప్పటికీ..హోం క్వారంటైన్ లో ఉండకుండా అదే పనిగా బయటకు వస్తున్న ఉదంతాలు కొన్ని బయటకు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన వారు బయటకు రావటం వల్ల కలిగే ప్రమాదం ఏమంటే.. ఒకవేళ వారికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడితే.. వారు బయటకు తిరిగినప్పుడు.. వారు కలిసిన వారందరికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీంతో వారిని ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటున్నారు.
అయితే.. ప్రభుత్వం చేస్తున్న  సూచనల్ని పట్టించుకోకుండా మితిమీరిన విశ్వాసంతోబయటకు వస్తూ... అందరిని ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారి విషయంలో జమ్ముకశ్మీర్ పోలీసులు వినూత్న చర్యకు తెర తీశారు. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన వారు.. ఒకవేళ బయటకు వచ్చినట్లు గుర్తిస్తే.. వెంటనే వారి ముఖానికి క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. దీంతో.. వారు ఇప్పటికే తప్పు చేశారన్న విషయం అందరికి అర్థమయ్యేలా చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం కొందరిని కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపుతుంటే.. మరికొందరిని మాత్రం గాంధీకి.. ఇతర క్వారంటైన్ హోంలకు తరలిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కఠిన చర్యలు కానీ.. లేదంటే.. జమ్ముకశ్మీర్ లో మాదిరి ముఖానికి క్వారంటైన్ స్టాంపులు వేయటం మంచిదన్న మాట వినిపిస్తోంది. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.