ఎన్ కౌంటర్.. మీడియా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు 

April 03, 2020

సాధారణ రిపోర్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. పట్టుదల.. అంతకు మించిన మొండితనంతో పాటు తెలివితో ఒక దినపత్రికకు యజమాని కావటం.. టీవీ ఛానల్ నడపటం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఈ బాధ్యతలతో పాటు.. ప్రతి వారాంతంలోనూ కొత్త పలుకు పేరుతో బ్రాడ్ షీట్ లో దాదాపు అరపేజీకి పైనే తన అభిప్రాయాల అక్షరాల్ని గుమ్మరించేస్తుంటారు. ఆయన చెప్పేవన్ని నిజాలేనా? అంటే.. కాలానికి తగ్గట్లు సత్యం రూపు మారుతుంటుందన్న మాట సరిపోతుందేమో?
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ మీద.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివి మీదా.. ఆయన చాణుక్య నీతి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఫినిషింగ్ టచ్ గా మీడియా మీద సంచలన వ్యాఖ్యను చేశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను హక్కుల కార్యకర్తలు.. మానవతా వాదులు వ్యతిరేకించటం చేస్తే.. సామాన్యుల మొదలు సెలబ్రిటీలు.. ప్రముఖులు.. రాజకీయ నేతలు అందరూ సమర్థించారు. వ్యవస్థలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోవాలే కానీ.. తాను రాసుకున్న న్యాయానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదన్న విషయాన్ని పక్కన పెట్టి తక్షణ న్యాయం కోరుకునే ప్రజలకు.. వారు కోరుకున్నట్లే ఎన్ కౌంటర్ న్యాయాన్ని అందించిన వైనంపై ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు.. జరిగిన దానిని.. దానికి రిలేటెడ్ గా ఉండే అంశాలతో పాటు.. అన్ని కోణాల్ని ప్రస్తావించాల్సిన మీడియా సైతం చేష్టలుడిగిపోయిన వైనాన్ని ఆయన నిర్మోహమాటంగా ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది.
ప్రజల భావోద్వేగాల్లో మీడియా సైతం బందీ అయిన విషయాన్ని ఆయన ఒప్పుకున్న తీరు చూసినప్పుడు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు ప్రశంసించాల్సిందే. ఎందుకంటే.. ఈ మాత్రం ఒప్పుకోలు మిగిలిన మరే మీడియా సంస్థా.. దాని యజమాని చేయకపోవటమే. ఎన్ కౌంటర్ పై సామాన్యుల్లో నెలకొన్న సానుకూలత నేపథ్యంలో వారి మనసుల్ని గెలుచుకునేలా అందరూ వ్యవహరిస్తున్నారే కానీ.. వ్యవస్థకు ఇలాంటివి మంచివి కావన్న విషయాన్ని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు.
అందుకు సంబంధించిన వేదనను ఆంధ్రజ్యోతి ఆర్కే తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఆయన రాసిన తాజా వ్యాసంలో ఫినిషింగ్ టచ్ గా ఉన్న మాటల్ని యథాతధంగా.. ఎలాంటి మార్పులు చేయకుండా అందిస్తున్నాం. ‘‘మీడియా కూడా ప్రజలలో నెలకొన్న భావోద్వేగాలకు విరుద్ధంగా వ్యవహరించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే శుక్రవారంనాటి ఎన్‌కౌంటర్‌ను ఎవరికివారు శక్తివంచన లేకుండా శ్లాఘించారు. ఈ పరిణామాలు సమాజానికి మంచివా? కాదా? అన్నది కాలమే నిర్ణయించాలి! ’’  ఇంత ఓపెన్ గా విషయాన్ని చెప్పినందుకు మెచ్చుకోవాల్సిందే.