ఏబీఎన్ రాధాకృష్ణ గెలిచాడు

August 04, 2020

దమ్మున్న ఛానెల్ అని పేరు పెట్టుకుని ఎలాంటి కథనమైనా ధైర్యం ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న ఆంధ్రజ్యోతి గ్రూపు పై, దాని ఎండీ రాధాకృష్ణపై ప్రభుత్వాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇక్కట్లకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. గతంలో కేసీఆర్ ఏబీఎన్ టీవీ9 ఛానెల్ ను బ్యాన్ చేశారు. అయితే... అప్పట్లో ట్రాయ్ చట్టం లేకపోవడం వల్ల ఏబీఎన్ బ్యాన్ ఎత్తివేతకు సుదీర్ఘ పోరాటం చేసి సుప్రీంకోర్టులో విజయం సాధించారు రాధాకృష్ణ. 

తాజాగా వైసీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ఆధారంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేసింది. అయినా రాధాకృష్ణ వెనక్కు తగ్గలేదు. ఇపుడు ప్రసారాలకు ప్రత్యేక చట్టం, ట్రైబ్యునల్ ఉండటంతో వైసీపీ సర్కారు ప్రయత్నాలు ఫలించలేదు. ఏబీఎన్ యాజమాన్యం టీడీ శాట్ లో ఫిర్యాదు చేయగా...  ఏబీఎన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా ఎమ్మెస్వోలు పట్టించుకోలేదు. దీంతో ఏబీఎన్ రాధాకృష్ణ కోర్టు ధిక్కార పిటిషను వేశారు. దీనిని విచారించిన ట్రైబ్యునల్ ఎమ్మెస్వోలకు ఏడు మందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. ట్రైబ్యునల్ ఛైర్మన్ శివకీర్తిసింగ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు దిక్కార పిటిషను వేస్తున్నారు అని తెలియగానే రెండు రోజుల క్రితమే ప్రసారాలను పునరుద్ధరించారు. ప్రసారాల పునరుద్ధరణ జరిగిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పినా ట్రైబ్యునల్ పట్టించుకోలేదు. 

కోర్టు చెప్పాక కూడా ప్రసారాల పునరుద్ధరణలో ఆలస్యం చేసినందుకు జరిమానాలు కట్టక తప్పదని, ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది కోర్టు. భవిష్యత్తులో ఛానెల్ ప్రసారాలు ఇంకోసారి నిలిపివేయకుండా, నాణ్యత తగ్గించకుండా ఆదేశించాలని ఏబీఎన్ చేసిన అభ్యర్థనను ట్రైబ్యునల్ మన్నించింది. మొత్తానికి కొత్త ట్రాయ్ చట్టంతో ప్రభుత్వం ఏబీఎన్ పై అణచివేతకు చేసిన ప్రయత్నం విఫలమైంది. మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో... ఈ కేసుతో ప్రజలకు మరింత బాగా అర్థమైంది. దీంతో జగన్ సర్కారుపై రాధాకృష్ణ పైచేయి అయ్యింది.