రఫేల్... పేరు మార్చాల్సిందే... !

July 03, 2020

రఫేల్.. ఈ పేరును అర్జంటుగా మార్చాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. వారెవరో తెలుసా...? రఫేల్ గ్రామస్తులు...! కాంగ్రెస్ పార్టీకి ‘బోఫోర్స్’ ఎలాగో, బీజేపీకి ‘రఫేల్’ అలాగన్నమాట. రఫేల్ డీల్ కారణంగా, ఎన్నికల ముంగిట, బీజేపీ ప్రభుత్వానికి కష్టాలొచ్చి పడుతున్నాయి. ఈ సబ్జెక్టుతో ఏమాత్రం సంబంధం లేని ఆ గ్రామస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ‘రఫేల్’ కారణంగా తమకు చెడ్డ పేరు వస్తున్నదంటూ బాధపడుతున్నారు.
ఆ గ్రామం పేరు రఫేల్. ఛత్తీస్ గఢ్ లోని మహా సముంద్ నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంది. చాలా కాలం నుంచే ఈ గ్రామం ఇదే పేరుతో కొనసాగుతోంది. ఈ గ్రామస్తులకు నిన్న మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. రఫేల్ డీల్ వివాదంగా మారడంతో ఇప్పుడు ఈ గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారు. తక్షణమే తమ ఊరి పేరు మార్చాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ డిమాండుతో అక్కడి ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా యత్నించారు. వారికి సీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. ఎన్నికల తర్వాతనైనా తమ ఊరి పేరును మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ, ఈ గ్రామస్తుల బాధేమిటంటే... రఫేల్ వివాదం కారణంగా, దానితో ఏమాత్రం సంబంధం లేని తమ ఊరు బదనాం అయిపోతోందట... !