బాల‌య్య‌, టీఆర్ఎస్ ఎంపీ క‌లిసి ఏం చేశారో తెలుసా?

July 05, 2020

ఇటు సినీ జీవితంలో, అటు రాజ‌కీయంగా బిజీగాఉంటున్న నంద‌మూరి బాల‌కృష్ణ దీంతో పాటుగా మ‌రో అంశంలోనూ బిజీగా ఉండే సంగ‌తి తెలిసిందే. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టుకు చైర్మ‌న్‌గా ఉన్నారు. తాజాగా ఈ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ట్ర‌స్ట్ బోర్డుకు స‌భ్యుడిని నియ‌మించారు. బోర్డు సభ్యుడిగా డా.రాఘవరావు పోలవరపు ను నియమించారు. సంస్థ స్థాపనలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజనేషన్, అమెరికా సంస్థకు అధ్యక్షునిగా నియమితులైన డా. రాఘవరావు పోలవరపు ఇటీవలే మరణించిన ట్రస్టు బోర్డు సభ్యురాలు డా. తులసీదేవి పోలవరపు జీవిత భాగస్వామి.
స్వర్గీయ నందమూరి తారకరామారావు పిలుపు నందుకొని  న్యూయార్క్‌లో వైద్యుడిగా స్థిరపడిన డా. రాఘవరావు దంపతులు అమెరికాలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ స్థాపించి హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు అవసరమైన నిధులు సేకరణలో కీలక భూమిక పోషించారు. అనంతరం సంస్థ ట్రస్టు బోర్డు సభ్యులుగా కొనసాగిన డా. తులసీ దేవి నేతృత్వంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనేషన్ సంస్థకు వివిధ రూపములలో నిధుల సహాయాన్ని అందిస్తూ హాస్పిటల్ నేడు భారతదేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి ఎంతో దాహదపడ్డారు. ఇలా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరిస్తున్న డా.తులసీదేవి మరణానంతరం ఆ స్థానాన్ని డా. రాఘవరావు పోలవరపుతోనే భర్తీ చేయాలని భావించిన సంస్థ ట్రస్టుబోర్డు నేడు డా. రాఘవరావు పోలవరపు నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది.
దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని ట్రస్టు బోర్డు సభ్యులు నామా నాగేశ్వర రావు, జెయస్ ఆర్ ప్రసాద్, భరత్ మితుకుమల్లి సమక్షంలో ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అందించి డా. రాఘవరావు పోలవరపును అభినందించారు.  గతంలో వ‌లే రానున్న రోజులలోనూ డా. రాఘవరావు పోలవరపు బసవతారకం అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  
కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన డా. రాఘవరాపు పోలవరపు న్యూయార్క్‌లో ప్రముఖ ఆర్థోపీడియక్ సర్జన్. గుంటూరు మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్స్ లో యంయస్ చేసిన డా. రాఘవరావు నలభై సంవత్సరముల క్రితం దర్మపత్ని డా. తులసీ దేవి పోలవరపుతో కలసి అమెరికాలోని న్యూయార్క్ కు వెళ్లారు. అక్కడ పలు సంస్థలలో పని చేసిన ఆయన ప్రస్తుతం ప్రఖ్యాత బ్రూక్లిన్ హాస్పిటల్ సెంటర్ మరియు డౌన్ స్ట్రీట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ లలో ఆర్థోపెడిక్ వైద్య నిపుణులుగా వ్యవహరిస్తున్నారు.  అంతే గాకుండా గతంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్ గానూ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా న్యూయార్క్ చాప్టర్ ఫౌండర్ ట్రస్టీ గాను ఆయన పని చేశారు.  అలా అమెరికాలోనే కాకుండా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు సేవా కార్యక్రమాలలో డా. రాఘవరావు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.  గుంటూరు జిల్లాలలోని యన్ ఆర్ ఐ మెడికల్ కాలేజీ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ గానూ వ్యవహరిస్తున్నారు.