వైసీపీ ఎమ్మెల్యేలపై కేసుపెట్టిన ఎంపీ వర్గం

August 07, 2020

ఏపీలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. జగన్ ను గౌరవిస్తూనే, డిఫెండ్ చేసుకుంటేనే కోటరీని తిడుతున్న రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చిన్న చర్చతో సమసిపోయే వ్యవహారాన్ని వైసీపీ చాాల ముందుకు తీసుకెళ్లింది. రఘురామరాజును అతిగా పార్టీ నాయకులతో తిట్టించడం ద్వారా ఆయన వైసీపీ అక్రమాలను బయటపెట్టాడు.

ఇది పార్టీకి తీరని నష్టం చేసింది. ఎందుకంటే... ఇంతకాలం తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీ దృవీకరించడం అంటే... ఆరోపణలు అన్నిటికి ఎంపీ రఘురామరాజు ఆధారాలు ఇచ్చినట్టయ్యింది. దీంతో ఇంతకాలం టీడీపీ చెప్పినవి పచ్చి నిజాలు అని ఏపీ జనం నమ్మే పరిస్థితి వచ్చింది.

తమపై అవినీతి ఆరోపణలు చేయడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు.  ఎంపీ రఘురామకృష్ణం రాజును లక్ష్యంగా చేసుకుని వైసీపీ నియోజకవర్గాల వారీగా తమ పార్టీ నేతలను రంగంలోకి దింపారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేయించారు. జగన్ కు తెలియకుండా ఇవి జరిగాయని అంటే ఎవరూ అంగీకరించరు. ఎందుకంటే వైసీపీలో అంతా వ్యక్తిస్వామ్యం. అధినేత ఏం చెప్తే కేడర్ దాన్ని ఫాలో అవుతుంది. 

పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులు ఎంపీ రఘు రామ రాజు  దిష్టి బొమ్మలను దహనం చేశారు. దీంతో ఎంపీకి మండిపోయింది. అయినా... ఆయన చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చారు. నా దిష్టిబొమ్మలు దహనం చేశారు... కాస్త పశువులకు గడ్డి ఉంచి మిగతా దాంతో మాత్రమే ఆ పని చేయండన్నారు. ఇక ఆయన వర్గం ఒకడుగు ముందుకు వేసింది ఎమ్మెల్యేలపై వ్యూహాత్మక కేసులు పెట్టింది.

కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఈ తరహా నిరసనలు జరగడానికి వీల్లేదని ఒక సెక్షన్ ప్రకారం కేసు, ఎంపీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని మరో సెక్షన్ ప్రకారం... కేసులు పెట్టారు. ఒక చోట కాదు. తాడేపల్లిగూడెం, ఆచంట, ఉండి, ఆకివీడు పోలీస్‌స్టేషన్లల్లో ఒకే రోజు ఈ ఫిర్యాదులు అందడం విశేషం. దీంతో వైసీపీలో ఎంపీ - ఎమ్మెల్యేలపోరు కొత్త మలుపు తిరిగినట్టయ్యింది.