బయట తిరగొద్దని బెదిరిస్తున్నారు - ఎస్పీకి రఘురామరాజు లేఖ

August 03, 2020

పశ్చిమ గోదావరి వైసీపీ రాజకీయాల్లో ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదు. ఎంపీ రఘురామరాజుకు, వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది.

ప్రభుత్వం చేస్తున్న తప్పులను సద్విమర్శల రూపంలో చెబుతూ పార్టీని కాపాడటానికి రఘురామరాజు చేసిన ప్రయత్నాన్ని మీడియా, కొందరు నాయకులు కలిసి మరింత కెలికారు. దీంతో వివాదం ముదిరింది.

రోజురోజుకు ఇది శృతిమించి మాటల యుద్ధం కాస్తా తిట్లు, బూతుల దాకా వెళ్లింది. చివరకు రఘురామకృసం రాజు దిష్టిబొమ్మలను వైసీపీ కార్యకర్తలే భారీగా తగలబెట్టారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.

తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని, తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆ లేఖలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

తనకే ఫోన్ చేసి నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించే సమయంలో రక్షణ కల్పించాలని ఎంపీ లెటర్ హెడ్ పై ఆయన పీఏ కృష్ణవర్మ ఎస్పీని లేఖ ద్వారా కోరారు. ఈ లేఖ ఇపుడు వైరల్ అవుతోంది.

ఇక ఈరోజు రఘురామకృష్ణంరాజుపై ఒక ఆంగ్ల పత్రిక ఒక కథనం ప్రచురించింది. అందులో సీబీఐ కేసు చివరి దశకు వచ్చినట్టు, ఆ కేసు వల్ల ఆయన బీజేపీకి దగ్గర కావాలనుకుంటున్నట్లు రాసుకొచ్చారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో రఘురామరాజుపై కేసులు నమోదైనట్లు రాశారు.

మొత్తానికి రఘురామరాజు కేసు ముదిరి పాకాన పడింది. మరి ఇది ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. అయితే, మరోవైపు జగన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి, కరణంతో చేయించిన వ్యూహాత్మక ఫిరాయింపే బీజేపీ రఘురామరాజుతో చేయిస్తుందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.