పవర్ స్టార్‌కి రాజుగారి బూస్ట్

August 10, 2020

చంద్రబాబుతో పోరాడాల్సిన వైసీపీ చివరకు ఒక ఎంపీతో పోరాటంలోనే అలసిపోతోంది. ఒక్కడు అంత పెద్ద వైసీపీ పరివారానికి చుక్కలు చూపిస్తున్నాడు. చివరకు పవర్ ఫుల్ సీఎం అని పరివారం ప్రచారం చేసుకునే జగన్ కూడా బేలగా చూడటం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడేశాడు రఘురామరాజు. 

ఒక పార్టీకి ఊహించని రీతిలో షోకాజ్ నోటీసు కి రిప్లై ఇచ్చి ఆ పార్టీనే రిస్కులో పెట్టిన రఘురామరాజు ధైర్యంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆశీర్వాదాలు అండదండలు గట్టిగా అందాకే రాజు గారు రంగంలోకి దిగారని అందరికీ అర్థమైంది. దీంతో మొదట్లో అందరిపై చేసినట్లే బూతుల దాడి మొదలుపెట్టి... అతడి రేంజ్ ను అందుకోవడం కష్టం లే అని సైలెంట్ అయిపోయింది జగన్ బ్యాచ్.

తాజాగా రఘురామ రాజు పవన్ కళ్యాణ్ కి ఫైవ్ స్టార్ ఇచ్చారు.  ప్రతి పక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తారు. పవన్ అంతటి నిజాయితీ పరుడే లేడన్నారు. పవన్ వంటి వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే.. ఏపీ ఐదేళ్ల వ్యవధిలోనే ఇండియాలో నెం.1 గా నిలుస్తుందని అసలు ఇతరుల నుంచి పవన్ అభిమానులు ఎక్స్ పెక్ట్ చేయలేని ప్రశంసను కురిపించారు రాజుగారు.

ఎందుకబ్బా రాజుగారు పవన్ ని ఇంత పైకెత్తారు అంటే... ఇవ్వాళో  రేపో తాను చేరబోయే పార్టీకి ఇప్పటికే పవన్ అలయన్స్ లో ఉన్నారు కదా. అందుకేనేమో. అయితే... రాజుగారి నియోజకవర్గంలోనే పవన్ నిలబడి ఓడిపోవడం గమనార్హం. అంటే... అతనికి వేయకుండా నాకు ఓట్లేశారేంట్రా అని జనాల్ని ప్రశ్నించారు రాజుగారు. 

ఇక రాజకీయంగా చూస్తే పవన్ పట్ల ఆయన చేసిన ప్రశంస డోసు కాస్త ఎక్కువైందని... నిజాయితీ అనే పదం వరకు ఓకే గాని పవన్ తన ఆటిట్యూడ్ తో ఏపీని ఐదేళ్లలో నెం.1 చేస్తారని పొగడటం కాస్త వ్యంగంలా ఉందని అంటున్నారు. ఇలాంటి విమర్శలు కనుక రాజుగారు తరచూ చేస్తే అతని మాటకు మెల్లగా విలువ పడిపోయే అవకాశం లేకపోలేదు.