నేను సింహాన్నే... సింగిల్ గా వస్తా... జగన్ బొమ్మ లేకుండా గెలుస్తా- రఘురాముడి ఛాలెంజ్

August 15, 2020

వైసీపీ నేతల్లో బూతులు వాడని అతికొద్ది మంది నేతల్లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒకరు. ఇటీవల ఆయన వ్యవహారం వైసీపీ అధినేతకు చుక్కలు చూపిస్తోంది. తన పార్టీలో తనను ఎవరూ ఎదిరించలేరని ఫీలయ్యే జగన్ కు రఘురామకృష్ణం రాజు కొరకరాని కొయ్యగా మారారు. 

తనను బతిమాలితే పార్టీలోకి వచ్చాను. నేను ఎవరి దయతోను గెలవలేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. రఘురామ రాజు కులానికే చెందిన ప్రసాదరాజుతో వైసీపీ చేయించిన విమర్శలకు ఆయన సుతిమెత్తటి కౌంటర్ ఇచ్చారు. 

అయితే, మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి పేర్ని నానితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణం రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. మా ఎమ్మెల్యేలందరి ఓట్లకంటే ఎంపీ ఓట్లు తక్కువని... దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని ఎమ్మెల్యే కార్మూరి నాగేశ్వరరావు ఛాలెంజ్ చేశారు. ఆయనపై జగన్ ఆసక్తి లేకపోయినా మేమే జగన్ ను బతిమాలి ఆయనను పార్టీలోకి తెచ్చామన్నారు. వైఎస్ బొమ్మ, జగన్ కష్టంతోనే రఘురామ కృష్ణంరాజు గెలిచారని... అంత దమ్మున్నోడే అయితే సొంతంగా పోటీ చేసి ఎందుకు గెలవలేదని పేర్ని నాని విమర్శించారు. ఆయనే పార్టీ నుంచి పోయి మళ్లీ బతిమాలి వచ్చారన్నారు.

విశ్వాసంలో మేముం కుక్కతో పోటీపడతాం.  ఆయన పార్టీ మారాలనుకుంటే మారొచ్చు, పక్కచూపులు చూసిన ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు అని మంత్రి పేర్ని నాని అన్నారు. 

మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు, ఎమ్మెల్యే కొట్టు సత్యానారాయణ,  ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ లు కూడా రఘురామ రాజు పార్టీ మారాలనుకుంటే మారొచ్చన్నారు.

 

వీరి విమర్శలపై స్పందించిన రఘురామ రాజు పందులే గుంపుగా వస్తాయన్న సినిమా డైలాగును ఉదహరించి అసెంబ్లీలో లాబీల్లో నా మీద గుంపుగా విమర్శలు చేశారు. తనను విమర్శించి ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని అన్నారు. మీరు జగన్ బొమ్మ పెట్టుకుని గెలవండి, నేను కూడా మీకు గెలిచి చూపిస్తాను. స్కాములు చేస్తున్న ఎమ్మెల్యేలంతా నాపై మాట్లాడతారా? అని రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. 

నా గురించి మాట్లాడే ముందు పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని ఆయన హెచ్చరించారు. జగన్ అనేకసార్లు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే పార్టీలోకి వచ్చానని, ఎన్నికలకు ముందే జగన్ ఇంటికి వెళ్లను అని చెప్పాను. అందుకే జగన్ కూడా నన్ను ఎయిర్ పోర్టులోనే కలిశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామ కృష్ణం రాజు. 

మొత్తానికి వైసీపీ కేడర్ ను రఘురాముడు వణికిస్తున్నాడు. అతనిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేచిచూసే ధోరణిలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గం కావడంతో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.