అయ్యా సాయిరెడ్డి నువ్వు నాకు, జగన్ కు చిచ్చు పెట్టకు

August 03, 2020

నరసాపురం ఎంపీ రఘురామ రాజు మొదట్నుంచి చెబుతున్నది ఒకటే... నేను జగన్ ను అమితంగా ప్రేమించే వ్యక్తిని. కొందరు కోటరీగా ఏర్పడి జగన్ కు నాపై అబద్ధాలు చెప్పి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి నేను పరమ విధేయుడిని. దయచేసి నామీద కుట్రలు చేయొద్దు అన్నారు రఘురామరాజు.

రఘురామరాజు ఢిల్లీలోనే తిష్టవేశారు. వరుసగా ఎన్నికల సంఘాన్ని, లోక్ సభ స్పీకరు ఓం బిర్లాను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర రక్షణ మంత్రి బీజేపీ కీలక నేత రాజ్ నాథ్ సింగ్ ని రఘురామరాజు కలిశారు. అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. వైకాపాలో విజయసాయిరెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారని... జగన్ కి తెలియకుండానే కొన్ని అరాచకాలు చేస్తున్నారని... నాకు ఇచ్చిన నోటీసు కూడా జగన్ కి తెలియకుండానే ఇచ్చారని అంటున్నారు. 

ఆయన చెప్పిన అనేక విషయాల్లో కొన్ని హైలెట్స్ ఉన్నాయి.

1. తనకు సంబంధం లేని కేసును లింక్ చేసి బురద జల్లుతున్నారు.

2. సాయిరెడ్డికి పలుకుబడి ఉన్న పేపర్లలో కొన్ని వార్తలు రాయించి చూశారా రఘురామరాజుపై ఎలాంటి కథనాలు వస్తున్నాయో అని జగన్ కి చెబుతున్నారు.

3. చనువు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సాయిరెడ్డి నాపై విమర్శలు చేయించారు.

4. విజయసాయి రెడ్డి సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు.

5. సాయిరెడ్డి నా మీద కక్ష గట్టి నాపై పార్టీ వారితో దాడులు చేయిస్తున్నారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి ఒక హెచ్చరిక చేశారు - 'అయ్యా విజయసాయిరెడ్డి  గారూ... నేనొక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. క్రమశిక్షణ కలిగిన ఎంపీని. మీరు పత్రికల్లో నాపై ఎన్ని దొంగరాతలు రాయించినా... ఆ దొంగరాతలను చూశారా, చూశారా అంటూ పదేపదే చెప్పినా... నేను ఏనాడు పార్టీని కానీ, పార్టీ అధినేత జగన్ ను కానీ వ్యతిరేకించలేదు. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన నన్ను శిక్షించాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి'