రఘురాముడికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి?

August 07, 2020

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడు మారనున్నారా? పార్టీ అధ్యక్షుడు అంటే సామాజిక వర్గం సహా ఎన్నో లెక్కలు చూసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు బండి సంజయ్ రూపంలో బలమైన, యువతలో మంచి పట్టు ఉన్న అధ్యక్షుడు దొరికాడని పార్టీ భావిస్తోంది. కానీ ఏపీలో మాత్రం అధినాయకత్వానికి సరైన నాయకులు దొరకడం లేదట. అంతకుముందు హరిబాబు, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు సౌమ్యులు కావడం లేదా పార్టీ వాదన బలంగా వినిపించలేకపోతున్నారనే అసంతృప్తి క్యాడర్‌లో కనిపిస్తోంది. ఏపీలోను ఓ బలమైన నాయకుడు కావాలని కోరుకుంటున్నారు.

కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధ్యక్షుడిగా చేసిన సమయంలో పురంధేశ్వరి, సోము వీర్రాజు వంటి పేర్లు వినిపించాయి. చివరకు కన్నాను వరించినప్పటికీ ఆ తర్వాత కొద్దికాలం నుండి, పార్టీ అధిష్టానం స్ట్రాంగ్ పర్సన్ కోసం వెతికి వెతికి అలసిపోయిందట. ఇప్పుడు హఠాత్తుగా ఎవరూ ఊహించని పేరును పరిశీలిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ఇచ్చేందుకు బీజేపీకి వెసులుబాటు లేదని అంటున్నారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గానికి చెందినవారు. కమలం పార్టీకి దగ్గరివాడు. ఆయన కులం వంటి అంశాలు పట్టించుకోనని పదేపదే చెప్పినప్పటికీ రాజకీయాలకు ఇది కీలకాంశం. పైగా ఇప్పటికే బీజేపీ ఆ సామాజిక వర్గం చేతిలో పదవి పెట్టి చూసింది. కాబట్టి బీజేపీ మరోసారి కాపులను తెరపైకి తెచ్చే అవకాశం లేదు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను చూస్తే చంద్రబాబు, జగన్‌కు ధీటైన నాయకుడు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించిందట.

ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కోసం చూసిన బీజేపీకి చివరకు ఓ కొత్త పేరు కనిపించిందని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పటి వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రులు అయ్యారు. కాపు సామాజిక వర్గానికి పార్టీలలో ప్రాధాన్యత ఉన్నప్పటికీ సీఎం అసంతృప్తి ఉంది. అందుకే జనసేనకు కాపులు అండగా నిలుస్తున్నారని అంటారు. బీజేపీ మధ్యేమార్గంగా 'రాజు'లను ఎంచుకుందట. బీజేపీ అధ్యక్ష పదవిని ఈ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఆర్‌కే రాజుకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది.

అశోక్ గజపతిరాజు, సుజయ కృష్ణరంగారావుల నుండి కృష్ణంరాజు వరకు వివిధ పార్టీల్లో ఉన్నత పదవులు అనుభవించినప్పటికీ 'ముఖ్య'మైన పదవులకు మాత్రం దూరంగా ఉన్నారు. సీఎం పదవి ఒక్కసారీ దక్కలేదు. బీజేపీ ఎంచుకున్న రఘురామ కృష్ణంరాజు (ఆర్ఆర్‌కే రాజు) ఆర్థికంగా కూడా బలంగా ఉన్నాడట. నాయకత్వ లక్షణాలు కూడా గట్టివే. బెరుకు లేని మనిషి. దీంతో ఆయన వైపు మొగ్గు చూపుతోందని సమాచారం.

ఓ కొత్త, బలమైన సామాజిక వర్గానికి కీలక పదవి ఇవ్వడం ద్వారా... ఏపీ బీజేపీ మరింత ఎదిగే అవకాశం ఉందని పార్టీ భావిస్తోందట. నెంబరు పరంగా ఆ కులస్థులు తక్కువే అయినా, వారి ప్రభావం ఏపీపై బలంగా ఉంది. దేశ విదేశాల్లో రాజులు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆర్ఆర్కే కూడా గట్టి మనిషి, ఆర్థికంగా బలమైన వాడు, బలమైన సామాజిక వర్గం వ్యక్తి. అందుకే అధిష్టానం ఆయన వైపు చూస్తోందని తెలుస్తోంది.

అయితే, ఇప్పటికీ అతను వైసీపీలోనే ఉన్నా పరిణామాలు చూస్తుంటే త్వరలో పార్టీ మార్పు తథ్యమని అర్థమవుతోంది.