నిమ్మగడ్డ కేసు తీర్పు-  RRR సంచలన కామెంట్స్ 

August 13, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి పునర్నియామకంలో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా, కోర్టు ధిక్కరణను ఆపాలని అనాలోచితంగా సుప్రీం కోర్టుకు వెళ్లిన జగన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

దీనిపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు ఘాటుగా స్పందించారు.

చెప్పుడు మాటలు విని జగన్ తప్పుడు దారిలో పోతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ గారికి ముందు నుంచి నేను చెబుతున్నాను, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్లకండి... హైకోర్టు చెప్పినట్లు నిమ్మగడ్డను నియమించండి అని కోరాను.

అయినా ఆయన పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అంటూ రఘురామరాజు వ్యాఖ్యానించారు. 

ఇప్పటికైనా జగన్‌ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ని వెంటనే నియమించాలని కోరారు.

అసలు రమేష్‌ కుమార్‌ను నియమిస్తే ఏపీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. న్యాయస్థానాలను గౌరవిద్దాం, న్యాయవ్యవస్థ విలువను కాపాడదాం అని రఘురామరాజు పిలుపునిచ్చారు.

 

ప్రజాస్వామ్య విరుద్ధంగా ముందుకు పోవడాన్ని ఇపుడైనా విరమించుకుంటే మంచిదన్నారు. రమేష్‌కుమార్‌ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం సరైన నిర్ణయమే అని కరోనా ప్రూవ్ చేసిందని, ప్రజలు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారని RRR అన్నారు. 

రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లడానికి ఎవరికీ అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాటలో నడవొద్దు అని కోరుకుంటున్నట్టు చెప్పారు.

కొందరు రాజ్యాంగంపై కనీస అవగాహన లేకుండా ఫిర్యాదు చేశారని... దానివల్ల నాకేమీ కాదన్నారు. ఇది రాచరికం కాదు అనుకున్నదల్లా జరగడానికి... ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనపుడు, ప్రజల మనసు తెలుసుకుని, రాజ్యాంగం అనుగుణంగా నడుచుకోవాలన్నారు. 

ప్రజాప్రతినిధి గొంతు నొక్కే  హక్కు ఎవరికీ లేదన్నారు.