వైఎస్సార్సీపీకి నిద్రపట్టకుండా చేసిన రఘురామరాజు షాక్

August 10, 2020

రఘురామకృష్ణంరాజుతో ఎందుకు పెట్టుకున్నాంరా అని వైకాపా అధినేతకు అనిపించేలా షాకుల మీద షాకులు ఇస్తున్నారు నరసాపురం ఎంపీ రఘురాముడు. ప్రభుత్వంలో కొన్ని తప్పలు జరుగుతున్నాయి. సరిదిద్దుకుంటే ప్రజల మనసు గెలుస్తాం అని చెప్పిన పాపానికి కార్నర్ చేసి టార్చర్ పెట్టడంతో రఘురామకృష్ణం రాజు తనపై విమర్శలు చేసిన వారికి వార్నింగులు ఇచ్చారు.

దీంతో వైకాపా పార్టీ రఘురామరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ ధిక్కార ధోరణికి సమాధానం చెప్పాలని పేర్కొంది. ఇటీవల ఆయన మాట్లాడినట్లు వచ్చిన పార్టీ క్లిప్పింగులను జోడించి నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో ఒక పాత విషయాన్ని కూడా జోడించారు. 

కొంతకాలం క్రితం ఈ గొడవ లేకముందు రఘురామకృష్ణం రాజు బొచ్చులో నాయకత్వం అని అన్నమాటను అదేపదంతో లేఖ లో ప్రస్తావించడం కొసమెరుపు. ఇదంతా ఒకెత్తు.

తాజాగా ఆ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసుపై వైసీపీ ఊహించని రిప్లై ఇచ్చారు ఎంపీ రఘురామరాజు. పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ముందు తన అనుమానాలు నివృత్తి కావాలన్నట్లు షోకాజ్ నోటీస్ పంపిన విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

 

* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది?

* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారు? 

* రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు? 

* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? 

* క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా? 

* క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? 

* క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపండి 

 

ఇవి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి రఘురామ కృష్ణంరాజు వేసిన ప్రశ్నలు. వీటన్నింటిని ఒక్క ముక్కలో చెప్పాలంటే... నాకు నోటీసు ఇవ్వడానికి నువ్వు ఎవరు? అని ప్రశ్నించాడన్నమాట. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బీ ఫాం మీద గెలిచాను. నేను ఆ పార్టీలోనే ఉంటాను. ఈ నోటీసు ఇచ్చిన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ అని ఉంది రఘురామరాజు రిప్లై ఇచ్చారు. నేను గెలిచిన పార్టీ తరఫున నోటీసు పంపిస్తే సమాధానం చెబుతాను అని పేర్కొన్నారు. రఘురామరాజు రిప్లైకి ఎలా స్పందించాలో కూడా తెలియని అయోమయం ఇపుడు వైకాపాది. మరి తమ సహజమైన మొండితనంతో ఎలా ముందుకు వెళ్తారో చూద్దాం.