అకటా రఘువీరా! ఎట్టి దుస్థితి వచ్చినవి

February 26, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అత్యంత దీనావస్థకు చేరుకుంది. వరుసగా రెండు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కానీ, అసెంబ్లీ సీటు కానీ సాధించలేకపోయిన ఆ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉంది. కష్టాల్లో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఎన్.రఘువీరారెడ్డి కూడా ఇతర నాయకులు ఎవరూ రాకున్నా ఒక్కడే జనంలో కలిసిపోతూ సాగిపోతున్నారు. తాజాగా ఆయన సొంత జిల్లా అనంతపురంలోని మడకశిర మండలం గంగులవాయి పాళ్యంలోని చెరువుకు గండిపడగా.. దాన్ని పూడ్చడానికి స్థానికులతో కలిసి ఇసుక మూటలు మోస్తూ కనిపించారు. ఆ చిత్రాలను ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లో పీసీసీ అధ్యక్షులంటే ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా కూడా చాలా పవర్ ఫుల్ పదవి. అలాంటిది ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఇలా ఎండల్లో ఇసుక మూటలు మోయడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా రఘువీరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో పాటు జాతీయ స్థాయిలోనూ పార్టీ పతనావస్థలో ఉండడం.. జాతీయ స్థాయిలోనూ నాయకత్వ లేమితో దశాదిశా లేకుండా సాగుతుండడంతో కాంగ్రెస్ నాయకుల్లోనూ ఆశలు పోయాయి. సహచర నేతలెవరూ కలిసి రాకున్నా రఘువీరా ఒంటరి పోరు చేస్తున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికీ నిదులు కానీ, కార్యకర్తలు కానీ లేకపోవడంతో ఆయన గ్రామాల్లో తిరుగుతూ వారితో కలిసి ఇలా కనిపిస్తున్నారు.
విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అదేసమయంలో పొరుగునే తెలంగాణలో మాత్రం పార్టీ ఇంకా బతికే ఉంది. అక్కడ పీసీసీ అధ్యక్స పదవి కోసం నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంది. అక్కడి నాయకుల హవా కూడా బ్రహ్మాండంగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో రఘువీరాను ఇలా చూసి కాంగ్రెస్ పార్టీయే కాదు ఇతర పార్టీల నాయకులూ అయ్యో అంటున్నారు.