రెహ‌మాన్‌ను మ‌ళ్లీ హ‌ర్ట్ చేశారు

August 10, 2020

రీమిక్స్ పేరుతో పాత క్లాసిక్ సాంగ్స్‌ను ఖూనీ చేసే వ్య‌వ‌హారం అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఉంది. ఈ మ‌ధ్య బాలీవుడ్లో ఈ ఒర‌వ‌డి బాగా పెరిగింది. ఒరిజిన‌ల్ పాటలు కంపోజ్ చేసిన సంగీత ద‌ర్శ‌కులను సంప్ర‌దించ‌కుండానే, వారి గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండానే వాటి రీమిక్స్ రెడీ చేస్తున్నారు. లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ పాట‌లు ఈ మ‌ధ్య వ‌రుస‌గా రీమిక్స్ అవుతుండ‌టం శ్రోత‌ల‌కు తెలిసే ఉంటుంది. ఐతే ఆ పాట‌లు ఎంత‌మాత్రం ఒరిజినల్స్‌కు సాటి వ‌చ్చేలా ఉండ‌ట్లేదు. ముకాబులా స‌హా రెహ‌మాన్ పాట‌ల రీమిక్స్ అన్నీ పాత వాటి ముందు తేలిపోయాయి. ఈ విష‌యంలో రెహ‌మాన్ కూడా చాలా అసంతృప్తితో ఉన్న విష‌యం ఇంత‌కుముందే వెల్ల‌డైంది. త‌న ఈశ్వ‌ర్ అల్లా పాట‌ను చంపేశారంటూ రెహ‌మాన్ ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రోసారి త‌న పాట రీమిక్స్ విష‌యంలో రెహ‌మాన్ త‌న అస‌హ‌నాన్ని బ‌య‌ట‌పెట్టేశాడు. ఢిల్లీ-6లో వావ్ అనిపించిన మ‌సాక‌లి పాట‌ను తాజాగా త‌నిష్క్ బ‌గ్చి రీమిక్స్ చేశాడు. ఈ పాట‌ను తుల‌సి కుమార్, సాచెట్ ఆల‌పించ‌గా.. సిద్దార్థ్ మ‌ల్హోత్రా, తారా సుతారియాల మీద తెర‌కెక్కించారు. ఒరిజిన‌ల్ విన్న‌వాళ్లు ఈ పాట కొన్ని క్ష‌ణాలు విన‌గానే చెవులు మూసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో రెహ‌మాన్ సైతం ఈ పాట‌పై స్పందించాడు. ఎంజాయ్ ద ఒరిజిన‌ల్ అంటూ త‌న మ‌సక్క‌లి పాట‌ను ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు రెహ‌మాన్. అంతే కాక‌.. ఆ పాట కోసం ఎంత‌మంది ఎలా క‌ష్ట‌ప‌డింది కూడా వివ‌రించాడు. దాదాపు ఏడాది పాటు ఈ పాట కోసం సంగీత చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. రైటింగ్, సింగింగ్ విష‌యంలో ఎన్నో వెర్ష‌న్లు మారాయ‌ని.. 200 మంది మ్యుజీషియ‌న్స్ ఈ పాట కోసం ప‌ని చేశార‌ని రెహ‌మాన్ గుర్తు చేసుకున్నాడు. ఇంత క‌ష్ట‌ప‌డి చేసిన పాట‌ను ఇలా చెడ‌గొట్టేశారేంటి అన్న అస‌హ‌నం రెహ‌మాన్ మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డిపోయింది.