రాహుల్ సంచలనం! వినూత్న పథకంతో గాలం..

May 29, 2020

దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుండటంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు అలెర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎలక్షన్ ఫీవర్ ని క్యాచ్ చేసేలా రాహుల్ గాంధీ భారీ వరాన్ని కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పిస్తామని పేర్కొంటూ వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శంషాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. పేదవాడు ఎక్కడున్నా తమ ప్రభుత్వం వెతికి మరీ డబ్బులు వేస్తుందని స్పష్టం చేశారు. కనీసం ఆదాయం కంటే తక్కువగా ఏ ఒక్క వ్యక్తి ఉండేందుకు వీలు లేదని ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. అయితే ప్రధాని మోడీ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తుండడంతో దీనికి ధీటుగా దారిద్రయ రేఖకు దిగువన ఉన్న కుటుంబాలపై రాహుల్ గురిపెట్టి ఈ పథకాన్ని ప్రకటించారని విశ్లేషకులు అంటున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతీ కుటుంబానికి వివిధ పథకాల కింద అందుతున్న సబ్సిడీల మొత్తానికి మరికొంత అదనంగా కలిపి.. ప్రతీ నెల ఆదాయం కింద వచ్చేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే పేదలకు ఎంత మొత్తం ఇస్తారన్నది క్లారిటీ ఇవ్వలేదు రాహుల్.  పేదలకు డైరెక్టుగా నగదు బదిలీ చేయడం ద్వారా కోట్లాది కుటుంబాలకు దగ్గర కావచ్చొన్నది రాహుల్ వ్యూహంగా తెలుస్తోంది. ప్రధాని మోడీ ధనవంతులను టార్గెట్ చేశాడని.. తాము పేదల కోసం పథకాలు ప్రవేశపెట్టామని దీని ద్వారా రాహుల్ జనంలోకి వెళుతున్నారని సమాచారం. దేశంలోని దిగువ మధ్యతరగతి జనాలను, పేదలను ప్రధానంగా ఆకర్షించేలా రూపొందించబడుతున్న ఈ పథకం కాంగ్రెస్ కి ఎంత మేర మేలు చేయనుందనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి. చూడాలి మరి రాహుల్ వేసిన గాలం.. సక్సెస్ అవుతుందో! లేదో!