రాహుల్ గాంధీ పరధ్యానం ... మరో మిస్టేక్ !

July 14, 2020

ఎంపీల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం కోసం ప్రారంభ‌మైన లోక్ స‌భ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. చిన్నచిన్న తప్పులతో నిత్యం ట్రోల్ అయ్యే రాహుల్ గాంధీ మరోసారి ట్రోలర్లకు దొరికారు. లోక్ సభలో వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సంతకం పెట్టకుండా మరిచిపోయా వెళ్లిపోయారు. తర్వాత ఇతరులు గుర్తుచేస్తే మళ్లీ వెళ్లి సంతకం చేసొచ్చారు.
రాహుల్ పై లోక్ సభలో ఒక ఎపిసోడే నడిచింది. ప్ర‌మాణ‌స్వీకారం కోసం ప్రారంభ‌మైన లోక్ స‌భ‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎంపీ రాందాస్ అథ‌వాలే లేచి నిలుచొని రాహుల్ ఎక్క‌డ? అంటూ బిగ్గ‌ర‌గా అర‌వ‌టం వినిపించింది. దీనికి బ‌దులుగా విప‌క్షానికి చెందిన నేత ఒక‌రు.. ఆయ‌న ఇక్క‌డే ఉన్నారు.. వ‌స్తారంటూ బ‌దులివ్వ‌టం క‌నిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స‌భ ప్రారంభ‌మైన చాలాసేప‌టి వ‌ర‌కూ స‌భ‌లో రాహుల్ క‌నిపించ‌లేదు. కొద్ది గంట‌ల త‌ర్వాత మాత్రం ట్విట్ట‌ర్ ఖాతాలో ఆయ‌నో ట్వీట్ చేశారు. ఎంపీగా నాలుగోసారి నా ప్ర‌యాణం ఈ రోజే మొద‌ల‌వుతుంది. ఈ మ‌ధ్యాహ్నం ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాను..వ‌య‌నాడ్ ఎంపీగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించ‌బోతున్నా అంటూ ట్వీట్ చేశారు.
మ‌ధ్యాహ్నం ఆయ‌న లోక్ స‌భ‌కు వ‌చ్చారు. త‌న పేరు పిలిచిన వెంట‌నే ప్ర‌మాణం చేసిన ఆయ‌న‌.. అనంత‌రం పుస్త‌కంలో సంత‌కం పెట్టాల్సి ఉండ‌గా.. అదేమీ లేకుండా వ‌డివ‌డిగా వ‌చ్చేశారు. ఇంత‌లో అధికారుల‌తో పాటు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ ప‌లువురు ఎంపీలు ఆయ‌న సంత‌కం పెట్ట‌టం మ‌ర్చిపోయారంటూ గుర్తు చేశారు. దీంతో వెన‌క్కి వెళ్లిన ఆయ‌న రిజిస్ట‌ర్ లో సంత‌కం పెట్టి వ‌చ్చారు. ఆయ‌న తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో రాహుల్ త‌ల్లి సోనియాతో పాటు ప‌లువురు నేత‌లు బ‌ల్ల‌లు చ‌రిచి త‌మ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.

లోక్ స‌భ‌లో ఎంపీలు ప్ర‌మాణం చేసిన సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. వాటిల్లోకి వెళితే...

+ తండ్రి కొడుకులు ఎంపీలుగా గెలిచిన వారిలో ములాయం.. అఖిలేశ్ లు ఉన్నారు. ములాయం ముందువ‌రుస‌లో కూర్చుంటే.. అఖిలేశ్ ఆఖ‌రి వ‌రుస‌లో కూర్చోవ‌టం గ‌మ‌నార్హం.
+ మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్ నాథ్ ఎంపీగా ఎన్నికైన త‌న కొడుకు న‌కుల్ నాథ్ ను వెంట తీసుకొచ్చారు. ప‌లువురికి త‌న కొడుకును ప‌రిచ‌యం చేయ‌టం క‌నిపించింది.
+ అమేధిలో రాహుల్ ను ఓడించిన స్మృతి ఇరానీ పేరు పిలిచిన‌ప్పుడు ప్ర‌ధాని మోడీ.. పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాల‌తో పాటు అధికార ప‌క్ష స‌బ్యులంతా బెంచీల‌నుపెద్ద ఎత్తున చ‌రుస్తూ స్వాగ‌తం ప‌లికారు. అంద‌రి కంటే ఆమెకే ఎక్కువ టైం క‌ర‌ళాళ ధ్వ‌నులు వినిపించాయి. ఆ స‌మ‌యంలో రాహుల్ స‌భ‌లో లేరు.
+ ప‌శ్చిమ‌బెంగాల్ కు చెందిన మంత్రులు బాబుల్ సుప్రియో.. దేబ‌శ్రీ చౌదురిలు ప్ర‌మాణ‌స్వీకారం చేసే స‌మ‌యంలో
బీజేపీ నేత‌లు ప‌లువురు జై శ్రీ‌రాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.(జై శ్రీ‌రాం అని నినాదాలు చేయ‌టాన్ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా తీవ్రంగా వ్య‌తిరేకించే నేప‌థ్యంలో.. బీజేపీ నేత‌లు అలాంటి నినాదాలు చేశారు)
+ ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎంపీల్లో ఎక్కువ మంది హిందీలో ప్ర‌మాణం చేయ‌గా.. కొద్ది మంది మాత్రం సంస్కృతం.. ఇంగ్లిష్.. క‌న్న‌డ‌.. ఒడియా.. మ‌రాఠి.. అస్సామి..బెంగాలీ భాష‌ల్లో ప్ర‌మాణం చేశారు. కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కిష‌న్ రెడ్డి మాత్రం తెలుగులో ప్ర‌మాణం చేశారు.
+ ప్ర‌మాణం చేసిన ఎంపీల్లో ఎక్కువ‌మంది దైవ‌సాక్షిగా ప్ర‌మాణం చేయ‌టం గ‌మ‌నార్హం.
+ బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ జ‌నార్ద‌న్ సింగ్ సిగ్రీవాల్ భోజ్ పురిలో ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని చెప్ప‌గా.. ఆ భాష‌ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చ‌ని కార‌ణంగా ప్ర‌మాణం చేయ‌లేరంటూ అధికారులు నో చెప్పారు.
+ వ‌య‌నాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ ఇంగ్లిషులో ప్ర‌మాణం చేశారు.
+ లోక్ స‌భ‌లో తొలిరోజున ప‌లువురు ఎంపీలు త‌మ రాష్ట్ర సంప్ర‌దాయాన్ని ప్ర‌తిబింబించేలా ఆహార్యాల‌తో స‌భ‌కు వ‌చ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా పార్టీ కండువాలు వేసుకొచ్చారు. టీడీపీ ఎంపీల్లో రామ్మోహ‌న్ నాయుడు ప‌సుపుప‌చ్చ జాకెట్ ధ‌రించ‌గా.. గ‌ల్లా జ‌య‌దేవ్ భుజం మీద తెల్ల కండువా వేసుకొని ప్ర‌మాణం చేయ‌గా.. కేశినేని నాని మాత్రం అందుకు భిన్నంగా రోటీన్ దుస్తుల‌తో వ‌చ్చి ప్ర‌మాణం చేయ‌టం క‌నిపించింది.