రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం ప్రకటించబోతున్నారా?

June 01, 2020

తనకు దక్కకుండా పోయిన ప్రధాని పీఠంపై కుమారుడు రాహుల్ గాంధీని చూసుకోవాలనేది సోనియా గాంధీ జీవిత స్వప్నం. కానీ, అందుకు అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. కొడుకు ప్రధానమంత్రిని చేయడానికి కాంగ్రెస్ అథినేత్రిగా సోనియా చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో రాహుల్ గాంధీ ప్రధాని పదవి కాదు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉండలేకపోయారు. దీంతో మళ్లీ సోనియానే పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి భారం తరువాత రాహుల్ అన్నీవదిలి విదేశాల్లో కాలం గడుపుతూ దేశ రాజకీయాలను పూర్తిగా మరిచిపోయారనే అనిపిస్తోంది.
గత ఐదు ఐదున్నర సంవత్సరాలలో ఆయన మొత్తం 16 సందర్భాలలో విదేశీ పర్యటనలు చేశారు. ఇందులో తొమ్మిది సందర్భాలలో అయన ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో ఎవరికీ తెలియదు. చివరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు కూడా రాహుల్ విదేశీ యాత్రలకు సంబంధించిన సమాచారం లేక ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాహుల్ విదేశీ యాత్రలు వ్యక్తిగత యత్రాలే అయినా, ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో కూడా రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏమిటో? అంతు చిక్కని చిక్కు ప్రశ్నగా నిలిచింది. అనేక ఊహాగానాలకు తావిస్తోంది. పార్లమెంట్ సభ్యులు విదేశాలకు వెళ్లినప్పుడు తమ పర్యటన వివరాలను పార్లమెంట్ సెక్రటేరియట్‌కు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది, అయినా రాహుల్ గాంధీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విదేశీ పర్యటనలకు వెళుతున్నారు.  
లోక్‌సభ ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా చాలా సందేహాలకు తావిస్తోంది. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారన్న గుసగుసలు కాంగ్రెస్ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు నవంబర్ 5 నుంచి 15 వరకు దేశ వ్యాప్త ప్రచార ఉద్యమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. ఇందులోనూ రాహుల్ గాంధీ జాడ లేదు.
మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆరోగ్యకరంగా లేదు. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. నిరుద్యోగం భయపెడుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఆ రాష్ట్రం రాష్టప్రతి పాలనా దిశగా సాగుతోంది. మరో వంక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ అన్నిటినీ మించి దేశ రాజకీయాల గతిని, గమ్యాన్ని మార్చి వేసిన అయోధ్య కేసు తుది తీర్పు రానే వచ్చింది. వీటిలో దేనిపైనా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేవు. అడపాదడపా ట్వీట్లు చేయడం మినహా ఆయన ఏమాత్రం యాక్టివ్‌గా లేరు. త్వరలో రాజకీయ సన్యాసం ప్రకటిస్తారని తెలుస్తోంది.