రాయ్ బరేలీ కాంగ్రెస్ లేడీ ఎమ్మెల్యే హాట్ టాపిక్

April 01, 2020

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ.. ఆర్టికల్ 370లో మార్పులు చేర్పులు చేసిన మోడీ సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతలా వ్యతిరేకిస్తుందో తెలిసిందే. యావత్ దేశం మోడీ సర్కారు తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న వేళ.. విపక్షాలకు చెందిన కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇలా వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఆ పార్టీకి చెందిన పలువురు తమ అభిప్రాయాల్ని వెల్లడించటం తెలిసిందే.
ఇలాంటివేళ.. పార్టీ స్టాండ్ కు భిన్నమైన తీరును ప్రదర్శించి అందరి చూపు తన మీద పడేలా చేశారు రాయ్ బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్. కశ్మీర్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసిన ఆమె.. దేశ సమైక్యతకు మేమంతా కట్టుబడి ఉంటాం.. జైహింద్ అని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన ఆమె ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.
అయితే.. అధితి సింగ్ పోస్ట్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ ఎంపీస్థానం పరిధిలోనిదే రాయ్ బరేలీ అసెంబ్లీ స్థానం. పార్టీ మాజీ అధినేత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న నేత.. పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేయటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.దీనిపై కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

కొసమెరుపు - ఆమె నిరాడంబరంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా బాగా యాక్టివ్ శివ భక్తురాలు. బహుశా అందుకే ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా హిందుత్వ  కోణంలో కాశ్మీర్ ఇష్యూపై కాంగ్రెస్ ను వ్యతిరేకించి ఉండొచ్చు.