జనాల్ని కంట్రోల్ చేయమంటే.. పొదుపు చేస్తోంది

August 09, 2020

కరోనా వైరస్ నేపథ్యంలో సామాజికంగా చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల అలవాట్లలో మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తెర మీదకు వస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రైల్వే శాఖ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే కొన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ను రూ.10 నుంచి రూ.50కు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా.. రిజర్వేషన్ల టికెట్ల మీద ఇచ్చే రాయితీని కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా అనవసరమైన ప్రయాణాల్ని అడ్డుకునేందుకు వీలుగా..వివిధ వర్గాలకు అందించే రాయితీలకు కోత విధించాలని నిర్ణయించారు. అయితే.. ఈ నిర్ణయం తాత్కాలికంగా చెబుతున్నారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లువెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా పెద్ద వయస్కుల వారి మీద ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో.. వారు ప్రయాణాల్ని రద్దు చేసుకునేందుకు వీలుగా రాయితీల్ని మినహాయించినట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు.
రిజర్వుడు.. అన్ రిజర్వుడు టికెట్ల మీద వారికిచ్చే రాయితీల్ని తీసేస్తున్నారు. ఇదే కాదు.. వివిధ వర్గాల వారికి ఇచ్చే రాయితీల్లోనూ కోత పెడుతున్నారు. అతి కొద్ది మందికి ఇచ్చే రాయితీల్ని మాత్రమే కొనసాగించనున్నారు. అంతేకాదు.. పలు రూట్లలోని రైళ్ల సర్వీసుల్ని వచ్చే నెల మూడో తేదీ వరకూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాయితీలు కోత పెట్టినంతనే ప్రయాణాల్ని ఆపేసుకుంటారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ప్రయాణాలు తప్పక చేయాల్సి వచ్చిన వారు రాయితీ తీసేసిన కారణంగా భారాన్ని మోయాల్సి వస్తుందన్నది ప్రభుత్వం ఎందుకు మర్చిపోతున్నట్లు?