రాజ్‌గోపాల్‌రెడ్డి సైలెన్స్ వెనక క‌థ ఇదే..

May 26, 2020

న‌ల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఇటీవ‌ల సైలెంట్ అయ్యారు. పార్టీ మారే విష‌యంలో ఆయ‌న పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతార‌నే వార్తలు ఇటీవ‌ల బ‌లంగా వ‌చ్చాయి. ఆయ‌న కూడా ఆ వార్త‌ల‌ను ఎక్క‌డా ఖండించ‌లేదు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి బీజేపీయే ప్రత్యామ్నాయం అని స్వయంగా వ్యాఖ్య‌లు చేయ‌డంతో కాంగ్రెస్‌లో దుమారం రేగింది. ఈక్ర‌మంలోనే అధిష్టానం ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అంతా భావించారు.

అయితే రాజ‌గోపాల్ రెడ్డి ఇటీవ‌లి కాలంలో కొంత మెత్త‌బ‌డ్డారు. పార్టీ మారే విష‌యంలో సందిగ్ధంలో ప‌డిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బీజేపీలో చేరాలా... లేక కాంగ్రెస్ లోనే కొన‌సాగాలా ? అన్న డైల‌మాలో ఉన్నారు. ఇటీవల రాష్టానికి వ‌చ్చిన పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలోనే రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని అంతా భావించిన‌ప్ప‌టికీ, అలా జ‌ర‌గ‌లేదు. దీంతో నియోజకవర్గoలో క్యాడర్ అంతా అయోమయంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల పైనే ఉంది. నియోజకవర్గ పరిధిలో కొత్తగా చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలు ఏర్ప‌డ్డాయి. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలా.. లేక బీజేపీ నుంచి బ‌రిలో దిగాలా అన్న‌ సస్పెన్స్ క్యాడర్ లో నెలకొంది. కార్యకర్తలకు బీజేపీలో చేరిక‌కు నిరాస‌క్తి చూప‌డంతో రాజగోపాల్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. అంతేగాక తాను పార్టీ మారితే సోదరుడు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనతో వస్తారని భావించిన రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలొనే కొనసాగుతానని చెప్పడంతో డైలమాలో ప‌డిన రాజ‌గోపాల్ రెడ్డి ము న్సిపల్ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీజేపీలోకి వెళితే 2024లో తానే సీఎం అని కార్యకర్త కు చెప్పిన ఫోన్ సంభాషణ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిని బీజేపీ పెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీలో చేరక ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంట‌ని వారు ఆగ్ర‌హం వ‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో కోమటిరెడ్డికి రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర‌ పరిస్థితి నెలకొంది. ఈక్ర‌మంలోనే కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ చేస్తే ఫిరాయింపున‌కు అనుకూలంగా ఉంటుందని పార్టీ అధిష్టానం యోచిస్తుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌గోపాల్ రెడ్డి సందిగ్థంలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న కాంగ్రెస్‌లోనే ఉంటారా...లేక బీజేపీలోకి వెళతారా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.