రాజమౌళి సంచలన ప్రకటన

May 27, 2020

బాహుబలికి ముందే తన సినిమా అంటే జనాల్లో రాజమౌళికి సార్వజనిక ఆమోదం లభించింది. అతని మేకింగ్ ని ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు లేడు. మగధీర, ఈగ సినిమాలు అతని ప్రతిభకు నిదర్శనాలు. అయితే... బాహుబలి తర్వాత అతను అంతర్జాతీయ ఫిగర్ అయిపోయారు. తెలుగు సినిమాతో వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ను దాటేశాడు రాజమౌళి. కథను నమ్మి... మేకింగ్ తో అద్భుతాలు సృష్టించే రాజమౌళి ప్రస్తుతం RRR అనే మల్టీస్టారర్ నిర్మిస్తున్నారు. రాబోయే కొత్త ఏడాదిలో ఆ సినిమా విడుదల కానుంది. అది ఎంతో కాలం లేదు. మరో ఆరేడు నెలల్లో ఆ సినిమా వచ్చేస్తుంది. మరి ఆ తర్వాతేంటి?

ఈ ప్రశ్నకు ఈరోజు రాజమౌళి పరోక్షంగా సమాధానం ఇచ్చారు. ఇటీవల విడుదలైన మత్తు వదలరా సినిమా టీంను రాజమౌళి కలిశారు. వారితో ఒక ప్రత్యేక చిట్ చాట్ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రాజమౌళిని ఆ టీంలో ఒకరైన సత్య భవిష్యత్తు ప్రాజెక్టు అయిన మహాభారతం గురించి కదిలించాడు. అయితే... దీనిపై రాజమౌళి తన నోటితో మునుపు ఏ ప్రకటన చేయలేదు. కానీ ఈరోజు పెద్ద హింట్ ఇచ్చాడు. 

నాకు మహాభారతం తీయాలన్నది కల. చాలా ఆసక్తి ఉంది. అది చాలా పెద్ద సబ్జెక్టు. దానిని ఓ భాగం మాత్రమే తెరకెక్కించడం నా ఉద్దేశం కాదు. మహాభారతం మొత్తం కథను సినిమాగా తీస్తాను. ఇందులో ఏ అనుమానమూ లేదు అన్నారు. అయితే.. తీస్తాను అనే విషయం తప్ప మరే వివరాలు లేవు. కాకపోతే నవరసభరితమైన ఆ ఇతిహాసం రాజమౌళి తీస్తాను అని చెప్పడమే జనాలకు ఓ సర్ ప్రైజ్. న్యూ ఇయర్ గిఫ్ట్?