రాజ‌మౌళిని కొట్ట‌డ‌మా.. నో ఛాన్స్

July 14, 2020

బాహుబ‌లిని చూసి ఇప్ప‌టిదాకా చాలామంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అశుతోష్ గోవారిక‌ర్ అనే ద‌ర్శ‌కుడు కూడా ఇలాగే బోల్తా కొట్టాడు. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన పానిప‌ట్ యుద్ధం ఆధారంగా ఆయ‌న తీసిన భారీ చిత్రం పానిప‌ట్ అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. అశుతోష్ సినిమాల్ని ఇష్ట‌ప‌డే క్లాస్ ఆడియ‌న్స్ సినిమా బాగుందంటున్నా.. మాస్ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా రుచించ‌ట్లేదు. మూడు గంట‌ల పాటు ఈ సినిమాను భ‌రించ‌డం క‌ష్ట‌మంటున్నారు. బాహుబ‌లిలా జ‌నాల్ని ఎంట‌ర్టైన్ చేసే, ఉద్వేగం రేకెత్తించే ఎపిసోడ్లేమీ పెద్ద‌గా ఇందులో లేవు. యుద్ధ స‌న్నివేశాలున్నా.. అవి బాహుబ‌లిలా ప్రేక్ష‌కుల రోమాల్ని నిక్క‌బొడుచుకోనివ్వ‌ట్లేదు.

‘బాహుబలి’ సినిమా చూసి అన్ని భాషల వాళ్లకూ అసూయ పుట్టింది. ఒక తెలుగు దర్శకుడు ఇలాంటి సినిమా తీసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు  పొందడం, బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఇతర భాషల అగ్ర దర్శకులకు ఎలాంటి ఫీలింగ్ కలిగించి ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాాదు. ఐతే మాకేం తక్కువ అనుకుంటూ ‘బాహుబలి’ని టార్గెట్ చేసిన దర్శకులెవరూ ఇప్పటిదాకా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా దేశవ్యాప్త మార్కెట్ ఉన్న హిందీ సినీ పరిశ్రమలో ‘బాహుబలి’ని బీట్ చేసే.. కనీసం దాని దరిదాపుల్లోకి రాగలిగే సినిమా ఒక్కటీ రాలేదు. గత మూణ్నాలుగేళ్లలో అక్కడ చేసిన భారీ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. చారిత్రక నేపథ్యంలో ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’, ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘క‌ళంక్‌’ లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో ఏదీ ‘బాహుబలి’ని బీట్ చేయలేదు.  ఇప్పుడు పానిప‌ట్ బాహుబ‌లిని బీట్ చేయ‌డం కాదు క‌దా.. దాని ద‌రిదాపుల్లోకి కూడా వెళ్లేలా లేదు.

బాలీవుడ్ అగ్ర దర్శకులతో ఉన్న సమస్య ఏంటంటే.. వాళ్లను వాళ్లు మేధావుల్లా అనుకుంటారు. వాళ్ల టేకింగ్ కూడా అలాగే ఉంటుంది. రాజమౌళికి వీళ్లను మించిన పనితనం, పాండిత్యం ఉన్నా కూడా ఆయన సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడినీ రంజింపజేసేలా ప్రతి సన్నివేశం ఉండేలా చూసుకుంటాడు. ఇందుకోసం తన మేధావి తనాన్ని తీసి పక్కన పడేస్తాడు. అవసరమైతే తన స్థాయి తగ్గించుకుంటాడు. మల్టీప్లెక్సులో సినిమా చూసే ‘ఎ’ సెంటర్ వాడే కాక.. నేల టికెట్ ప్రేక్షకుల్లో ఒకే రకమైన భావోద్వేగం రేకెత్తించడం రాజమౌళికే సాధ్యం. కాబ‌ట్టే బాహుబ‌లి అంత పెద్ద విజ‌యం సాధించింది. అత‌డిలా ఆలోచించ‌లేని ది బాలీవుడ్ గ్రేట్ బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ తీసిన‌ సినిమాలు ఇలా చ‌తికిల‌ప‌డుతున్నాయి.