ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్న రాజమౌళి

July 15, 2020

తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను చాటిన దర్శకుడిగా జక్కన్న అలియాస్ రాజమౌళి చరిత్రలో నిలిచిపోతారు. ఆ విషయంలో వేరే మాటే లేదు. ఆయన్ను అభిమానించే వారు.. ఆరాధించే వారు సైతం సినిమాల విషయంలో ఆయన చేసే ఆలస్యంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తూ..వ్యూహాత్మకంగా సినిమాల్ని ప్లాన్ చేసే జక్కన్న తాజాగా చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి తెలిసిందే.
యావత్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్ని పెద్దగా బయట పెట్టలేదు. షూటింగ్ ను సైతం చాలా గుట్టుగా పూర్తి చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది జూన్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేయటం తెలిసిందే.
అంటే.. మరో ఏడు నెలల్లో సినిమా విడుదల కానుందన్న మాట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి పోస్టర్ వరకూ కొత్తదనం ఏమీ లేకుండా సాగుతోంది. ఇప్పటివరకూ ఏం విడుదల చేసినా న్యూఇయర్ రోజున మాత్రం రాజమౌళి ఏదో ఒక సర్ ప్రైజ్ ను రివీల్ చేస్తారని అభిమానులు భావించారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
వారందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించిన రాజమౌళి.. ఎన్టీఆర్.. చెర్రీ ఇద్దరున్న ఒక అగ్రెసివ్ స్టిల్ ను న్యూఇయర్ కానుకగా విడుదల చేశారు. ఏదో స్పెషల్ ఉంటుందనుకుంటే.. చాలా సాదాసీదాగా ఉన్న పోస్టర్ విడుదల చేయటంతో నిరాశకు గురయ్యారు. గుట్టు మంచిదే కానీ.. మరీ ఇంత అవసరమా? అన్నది ప్రశ్నగా మారింది. ఏదో బ్రహ్మండం ఉందన్న ఫీలింగ్ పెరిగే కొద్దీ.. అంచనాలు భారీగా పెరుగుతాయని.. ఆ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
గుట్టు మంచిదే కానీ సహనానికి పరీక్ష పెట్టేంతలా మాత్రం ఉండకూడదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. శిల్పాన్ని చెక్కినట్లుగా సినిమాను చెక్కటం మీదనే జక్కన్నపైన చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడీ క్రేజీ సినిమాకు సంబంధించిన వివరాల్ని ప్రకటించే విషయంలో రాజమౌళి ప్రదర్శిస్తున్న గుట్టు పట్ల మాత్రం సోషల్ మీడియాలో అసహనం వ్యక్తమవుతోంది. అభిమానుల అతృత మంచిదే కానీ.. అది ఆగ్రహం స్థాయికి వెళ్లకూడదన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. మరీ.. పాయింట్ ను జక్కన్న నోట్ చేసుకుంటారా?