టైం చూసి వర్మకే సరదా పంచ్ విసిరిన జక్కన్న

August 11, 2020

ఎవరినైనా కెలకటంతో తిరుగులేని రీతిలో వ్యవహరించే సినీ ప్రముఖుడు రాంగోపాల్ వర్మ. కారణం ఉన్నా లేకున్నా.. తన మనసుకు అనిపించినట్లు అనేయటం ఒక అలవాటు. కొన్నిసార్లు కావాలని.. మరికొన్నిసార్లు అనుకోని రీతిలో పంచ్ లు వేస్తుంటారు రాంగోపాల్ వర్మ. అలాంటి ఆయన్ను కదిలించుకోవాలని.. సెటైర్లు వేయాలన్న సాహసానికి దిగరు.
అయితే.. మిగిలిన వారికి తాను భిన్నమన్న విషయాన్ని తాజా ట్వీట్ తో చెప్పకనే చెప్పేశారు దర్శక ధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. తాజాగా రాంగోపాల్ వర్మ తాత అయ్యారు. ఈ విషయాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు జక్కన్న. రాంగోపాల్ వర్మకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు రేవతి. డాక్టర్ గాపని చేస్తుంటారు. ఆమె తాజాగా అమెరికాలో పాపకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలిసిన వెంటనే వర్మకు అభినందనలు తెలిపారు రాజమౌళి. అయితే.. తన ట్వీట్ ను వర్మను కాస్త ఆట పట్టించేలా చేయటం ఆసక్తికరంగా మారింది. కంగ్యాట్యులేషన్స్ రాము తాతగారు.మీకు కళ్లెం వేయబోతున్న మీ మనవరాలికి నా అభినందనలు. మరి మీకేం కావాలి రాము నాన్న లేక రాము తాతయ్య? అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడీ వ్యవహారం అందరిని ఆకర్షిస్తోంది. వర్మపై జక్కన్న ట్వీట్ సెటైర్ చూస్తే.. టైం చూసి మరీ గురి పెట్టినట్లుగా ఉందని చెప్పక తప్పదు.