రాజశేఖర్ యాక్సిడెంటు కేసులో చాలా టిస్టులున్నాయబ్బా...

July 12, 2020
CTYPE html>
సంచలనంగా మారిన నటుడు రాజశేఖర్ కారు యాక్సిడెంట్ లో మరో కొత్త విషయం వెలుగు చూసింది. కారు టైరు పగిలిపోవటం వల్ల అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు చెబుతున్నా.. వాస్తవం మాత్రం మరోలా ఉందంటున్నారు. అమితమైన వేగంతో కారు నడుపుతున్న వేళ.. అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీ కొనటంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది.
సినిమాల్లోనూ కనిపించనంత యాక్షన్ సీన్ మాదిరి రాజశేఖర్ కారు పల్టీ కొట్టిన వైనం ఉందంటున్నారు. దాదాపు ఆరేడు పల్టీలు కొట్టటమే కాదు.. వంద నుంచి రెండు వందల మీటర్ల వరకూ గ్రీనరీ కోసం ఏర్పాటు చేసిన మొక్కలు ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో రాజశేఖర్ సీటు బెల్ట్ పెట్టుకోవటంతో పెను ముప్పు తప్పిందంటున్నారు. గంటకు 160-180 మధ్యలో ఉన్న కారు అదుపు తప్పి ఆరేడు పల్టీలుకొట్టిన తర్వాత కూడా స్వల్ప గాయాలతో బయటపడటం నిజంగా లక్ అంటున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోవటంతో పెనుప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రమాదానికి గురైన కారులో రెండు మద్యం సీసాల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా శంషాబాద్ సీఐ చెప్పటం ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్లైంది. ప్రమాదం జరిగిన వేళలో ఆయన మద్యం సేవించారా? లేదా? అన్న విషయంపై విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు. మీడియాలో వచ్చినట్లుగా మూడు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు వచ్చినప్పటికీ.. ఏడాదిలో దాదాపు 23 చలానాలు విధించినట్లుగా బయటకు వచ్చింది. 
ఈ చలానాల్లో అత్యధికం మితిమీరిన వేగానికి సంబంధించినవి కావటం గమనార్హం. కారులో రెండు లిక్కర్ బాటిల్స్ దొరికిన నేపథ్యంలో ఏం జరగనుంది? అన్నది ప్రశ్నగా మారింది. కారులో లిక్కర్ బాటిల్స్ ఉండటం తప్పుకాదు కానీ.. అవి ఓపెన్ అయి ఉన్నాయా? లేక సీల్ తీయలేదా? అన్న దానితో పాటు.. డ్రైవింగ్ చేసిన సమయంలో రాజశేఖర్ డ్రింక్ చేశారా? లేదా? అన్న దానిపై పోలీసులు విచారించే అవకాశం ఉంది. 
అయితే.. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కారులో లిక్కర్ బాటిల్స్ ఉన్న విషయాన్ని గుర్తించిన నేపథ్యంలో.. ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేశారన్న విషయాన్ని ఎలా పసిగడతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ర్యాష్ డ్రైవింగ్ కింద రాజశేఖర్ పై కేసు నమోదు చేశారు శంషాబాద్ పోలీసులు.