దేశంలో తొలిసారి.. ఆ రాష్ట్రాన్నిషట్ డౌన్ చేశారు

August 08, 2020

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మాయదారి వైరస్ వ్యాపించిన పలు దేశాలు.. ఈ వైరస్ అంతు చూసేందుకు షట్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో వైరస్ వ్యాప్తి జోరుగా సాగుతున్న.. షట్ డౌన్ చేయాలన్న నిర్ణయాన్ని ఏ రాష్ట్రం తీసుకోలేదు. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర.. కేరళ.. ఢిల్లీ.. ఉత్తరప్రదేశ్ లు ఉన్నాయి. అయినప్పటికి ఈ రాష్ట్రాలేవీ షట్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోలేదు.
కరోనా పాజిటివ్ కేసుల నమోదులో దేశంలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ మాత్రం అందుకు భిన్నంగా షట్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో మొత్తం 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా.. ఈ నెలాఖరు వరకూ రాష్ట్రం మొత్తాన్ని షట్ డౌన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో.. కరోనా కారణంగా పూర్తిగా నిర్భంధంలోకి వెళ్లిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా అర్థం చేసుకొని సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కోరుతున్నారు. శనివారం అర్థరాత్రి నుంచి రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. అత్యవసర సేవలు తప్పించి అన్ని బంద్ అవుతాయని చెబుతున్నారు.
పేదలకు ఆహార పొట్లాలు.. గోధుమపిండిని ఉచితంగా అందిస్తామని చెప్పారు. కరోనాను జయించేందుకు తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరుతున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా వైరస్ నియంత్రణలో ఇదో ముఖ్యమైన చర్యగా రాజస్థాన్ రాష్ట్ర సీఎం పేర్కొన్నారు.