రాజకీయం... ఫుల్ గా నేర్చేశాడు

May 27, 2020

సూపర్ స్టార్ రజనీకాంత్ మ‌రోమారు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.ఇటీవల కమల్ హాసన్ తమిళ ప్రజల కోసం రజనీకాంత్ తో కలిసేందుకు సిద్ధమని ప్రకటించిన ర‌జ‌నీ తాజాగా, మ‌ళ్లీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కమల్ హాసన్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మరో కీలక  హింట్ ఇచ్చారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. వచ్చే దఫా ఎన్నికల్లో తమిళ ప్రజలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే తీర్పు ఇస్తారని అన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కమల్ హాసన్ తో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తానని పరోక్షంగా చెప్పారు.
రజనీకాంత్ పార్టీతో కలిసి పని చేస్తామని, గత 44  సంవత్సరాల నుంచి తమ ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహంతో తమిళనాడు అభివృద్ధికి పాటుపడతామని మక్కాల్ నీది మయ్యం పార్టీ నాయకుడు కమల్ హాసన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో...ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీకాంత్ చెన్నైలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ‘2021లో తమిళనాడు ప్రజలు వందశాతం పెద్ద అద్భుతాన్ని సృష్టించబోతున్నారు’ అని పేర్కొన్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో  మహాద్భుతం జరుగుతుందని  సూపర్‌స్టార్ చెప్పారు. కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యంతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉందని, ఆ తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తామని రజనీకాంత్‌  అన్నారు.
కాగా, ఈ ఇద్ద‌రు సినీన‌టుల ఐక్య‌త‌మంత్రం వెనుక  యువ హీరో విజ‌య్ ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవ‌ల తదుపరి సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నతో తమిళనాడులో సర్వే నిర్వహించగా...రజినీకాంత్‌, కమల్‌హాసన్ కాకుండా...విజ‌య్‌కు ఓటేశార‌ట‌. పీకే సర్వే రిపోర్టు నేప‌థ్యంలో...క‌మల్ హాసన్‌-ర‌జ‌నీ కాంత్ పొత్తు పెట్టుకునే పరిస్థితి క‌లిగింద‌ని అంటున్నారు.