అయ్యో ... రజనీకాంత్

May 26, 2020

కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నికలు ఎపుడూ సంచలనమే. తమిళనాడు ఎన్నికలకు వచ్చినంత ప్రచారం వస్తుంది. చెన్నైలో జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, చాలామంది నటులు ఇందులో ఓటు హక్కు వినియోగించులేకపోవడం ఈసారి సంచలనం. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఫలితాల వెల్లడి మాత్రం కోర్టు తీర్పు అనంతరం జరుగుతుంది.
ఎన్నడూ లేని విధంగా నడిగర్ ఎన్నికల్లో చాలా మంది నటులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు ఈసారి. యాభై శాతం ఓటింగ్ మాత్రమే పోలైంది. నేరుగా ఓటు వేసేందుకు రాలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. విచిత్రం ఏంటంటే.. ప్రముఖ నటుడు రజనీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగాలని భావిస్తున్న రజనీకాంత్ ఈ ఎన్నికల్లో ఓటేయకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘దర్బార్’ షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారన్న సమాధానంతో ఎవరూ సంతృప్తి చెందడం లేదు. సినిమా పరిశ్రమ పరిపాలనకు సంబంధించిన ఈ ఎన్నికలను ప్రముఖ నటుడు మిస్సవడం ఏంటి? పైగా ముందే ప్రకటించిన షెడ్యూలు. దాని ప్రకారం సర్దుకోవాలి గాని ఇలా ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమే కదా అంటున్నారు. కనీసం పోస్టల్ బ్యాలెట్ కూడా వాడుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.