కాషాయంపై కస్సుమన్న సూపర్ స్టార్

July 03, 2020

తమిళ సినీ రంగంలోనే కాదు.. భారత చలనచిత్ర రంగంలో తిరుగులేని స్టార్ డమ్ ఉన్న హీరోల్లో ముందుంటారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమా విడుదల అవుతుందంటే.. ఆ రోజో పండుగలాంటి వాతావరణం ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఇమేజ్ ఉన్న రజనీ కొద్దికాలంగా రాజకీయాల్లో వస్తారని చెప్పటం.. ఆయన తీరు మోడీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్లుతా వార్తలు వస్తున్నాయి. ఇలాంటివేళ.. రజనీ నోటి నుంచి ఊహించని రీతిలో వచ్చిన మాటలు ఇప్పుడు సంచలంగా మారాయి.

త్వరలో తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తున్న వేళ.. తాజాగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ విగ్రహ ఆవిష్కరణకు చెన్నైలోని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ విగ్రహావిష్కరణ చేయగా.. తిరిగి వెళ్లే వేళలో రజనీని మాట్లాడాలని కోరారు మీడియా ప్రతినిధులు.
ఈ సందర్భంగా ఊహించని రీతిలో ఆయన మాట్లాడారు. తిరువళ్లవర్ విగ్రహ వివాదం మీద నోరు విప్పారు. ఇంతకీ ఈ వివాదం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ప్రముఖ రచయిత అయిన ఆయన విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయ వస్త్రాన్ని కట్టి.. మెడలో రుద్రాక్ష మాల వేసి పూజలు నిర్వహించారు.ఇదో వివాదంగా మారింది. దీనిపై మాట్లాడిన రజనీ.. తన వాదనను సూటిగా చెప్పేశారు.
తాను బీజేపీ వ్యక్తిని కాదని.. తనకు కాషాయరంగు పులమొద్దని కోరారు. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత ను ఒక వర్గానికి పరిమితం చేయటం సరికాదని.. అనవసరమైన వివాదాలకు తెర తీయొద్దని కోరారు.  దీంతో.. ఇంటా బయటా ఆయన మాటలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అసలే మోడీ అంటేనే .. తమిళులు ఇంత ఎత్తున ఎగురుతుంటారు. ఆయన్ను.. ఆయన భావజాలాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని వేళ.. రజనీ కూడా అదే వాదాన్ని వినిపించటం చూస్తుంటే.. తన మీద పడిన మోడీ మచ్చను తెలివిగా తుడిపేసుకుంటున్నారా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా చెప్పక తప్పదు. రజనీనా మజాకానా?