రాజ్యసభలో టీడీపీ తరఫున పోలైన ఓట్లెన్ని?

August 14, 2020

ఈరోజు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. 4 సీట్లు ఖాళీగా ఉండగా వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ గర్వం వల్లే మేము ఓడిపోతామని తెలిసినా ఎన్నికల్లో పోటీ చేసినట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలుగా 21 మంది ఓట్లు వేశారు. ఓట్లు వేయని ఆ ఇద్దరు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్. అచ్చెన్నాయుడు ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. కానీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇటీవలే కరోనా పాజిటివ్ అని తెలిసిన ముత్తిరెడ్డిని కలిశారట. అందుకని హోం ఐసోలేషన్ లో ఉండటం వల్ల ఓటింగ్ కు హాజరు కాలేదు. 

ఇదిలా ఉండగా మిగతా 21 మందిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఓటు వేసినా వారు వైసీపీకి వేయలేకపోయారు. వారు టీడీపీ నుంచి వైసీపీలోకి జంపయ్యారు. వంశీ బయటకు వచ్చాక... సస్పెండ్ చేసి ఓటు ఎలా అడుగుతారని వ్యాఖ్యలు చేయగా, మద్దాలి గిరి అధికారంలో ఉన్నపుడు రాజ్యసభ సీటు అమ్ముకున్నారని విమర్శలు చేశారు. ఇక కరణం బలరాం ఏమీ అనలేదు గాని 40 ఏళ్ల అనుభవాన్ని ఓటు వృథా చేయడానికి రంగరించాడు.

ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే... తెలుగుదేశం విప్ జారీ చేయడంతో... తమ ఓట్లు టీడీపీ అభ్యర్థికే వేసినా.. చెల్లకుండా పోయేలా తప్పుగా ఓటువేశారు. దీంతో వీరు ఓట్లు ఏ పార్టీకి రాకుండాపోయాయి.

ఈ నేపథ్యంలో టీడీపీకి అభ్యర్థికి 18 ఓట్లు పడాలి. అయితే, ఆదిరెడ్డి భవాని మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పొరపాటున ఒకటి పెట్టాల్సిన స్థానంలో టిక్ మార్క్ పెట్టడంతో ఆమె ఓటు చెల్లలేదు. దీంతో మొత్తం 17 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి.

ఇక జనసేన ఏకైక ఎమ్మెల్యే నా ఓటు నా ఇష్టం అంటూ వైసీపీకి వేశారట.