రకుల్ కు అలాంటి అనుభవాలు ఉన్నాయట

August 13, 2020

ఆ మధ్యన వరుస సినిమాల్లో నటించి.. ఆగ్రహీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఈ మధ్యన కాస్త తగ్గింది. ఓవైపు బాలీవుడ్.. మరోవైపు టాలీవుడ్ అంటూ రెండు పడవల మీద కాళ్లు పెట్టటంతో కాస్త లెక్క తేడా వచ్చింది. కాస్త ఫోకస్ పెట్టాలే కానీ.. అమ్మడుకి అవకాశాలు ఇవ్వనిది ఎవరు చెప్పండి?

ఇప్పుడైతే పేరున్న హీరోయిన్ గా మారింది కానీ.. కెరీర్ ఆరంభంలోనూ..  ఆ తర్వాత కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయని తాజాగా ఓపెన్ అయ్యింది. తనకు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కారణంగా.. సరైన అండ లేకపోవటంతో తనకు రావాల్సిన కొన్ని ఆఫర్లు వేరే వాళ్లకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
అలా జరిగిన వాటికి సంబంధించిన వివరాల్ని తాను వెల్లడించలేను కానీ.. తనకు ఛాన్స్ ఇచ్చి.. తర్వాత తనను కాకుండా వేరే వాళ్లను పెట్టుకునే వారన్నారు. తన తండ్రి కూడా ఏ నిర్మాతో.. దర్శకుడో అయి ఉన్నా.. సినిమా నేపథ్యం ఉన్నా తన నుంచి చేజారిన సినిమాలు తనకే వచ్చేవేమో? అని అన్నారు.
అలా అని తన నుంచి చేజారిన వాటి గురించి చింతలేదని చెబుతోంది రకుల్. ఎందుకంటే.. అమ్మడికి హ్యాండిచ్చి వేరే వాళ్లకు ఛాన్స్ ఇచ్చిన సినిమాలన్నీ ఫట్ మన్నాయని.. దాంతో తనకు అవకాశం రాకుండా జరగటం మంచిదే అయ్యిందని చెప్పింది. నన్ను భూమిలో పాతిపెట్టాలని ప్రయత్నించే వారికి నేనొక విత్తమన్న విషయం తెలీదన్న కోట్ తమ ఇంట్లో ఉంటుందన్న రకుల్.. తనను ఆ కోట్ తరచూ కొత్త స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి రకుల్ కు షాకివ్వాలనుకున్న వారందరికి ఎదురు షాక్ తగులుతుందన్న విషయాన్ని ముద్దుగుమ్మ భలేగా చెప్పింది కదూ?