కేసీఆర్‌ తాట తీసేందుకు టీం రెడీ చేస్తున్న రాంమాధవ్

August 12, 2020

2024 నాటికి తెలంగాణలో అధికారం అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అందుకోసం ఉత్తర, ఈశాన్య భారతాలకు తాను పన్నిన వ్యూహాలకు భిన్నమైన వ్యూహాలు, ప్రణాళికలతో రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీఆరెస్ దెబ్బకు కుదేలైన పార్టీల్లోని నేతలు, టీఆరెస్ దెబ్బకు రాజకీయంగా దారుణంగా దెబ్బతిన్న నేతలు, టీఆరెస్ చేతిలో మోసపోయిన నేతలు.. కేసీఆర్ అహంకారానికి బలైపోయిన నేతలను ఆకర్షించి వారిలో కసిని రగిల్చి.. వారి వద్ద ఉన్న కొన్ని ప్రత్యేక సామర్థ్యాలు, వనరులను తమకు అనుకూలంగా మలచుకుని 2024 ఎన్నికల్లో టీఆరెస్‌ను ఇంటికి పంపించడానికి సిద్ధమవుతున్నట్లుగా అర్థమవుతోంది. అలాంటి నాయకుల సామర్థ్యాలు, వారి వద్ద ఉన్న సాధానాలకు తమ బుద్ధి బలం, ధన బలం, అంగ బలంతో పదును పెట్టి కేసీఆర్‌పైకి వదలాలని డిసైడైనట్లుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే ఇద్దరు కీలక నేతలను బీజేపీలోకి తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. వారిలో ఒకరి పేరు ఆల్రెడీ ప్రచారంలో ఉంది. మంచి వాగ్దాటి ఉన్న ఆ నేత కేసీఆర్ పతనం కోసం కసితో ఎదురుచూస్తున్నారు. ఆ కసినే, బర్నింగ్ డిజైర్‌నే బీజేపీ ఇప్పుడు కోరుకుంటోంది. కేసీఆర్‌తో సమానమైన వాగ్దాటి.. తెలంగాణలోని బలమైన సామాజికవర్గ దన్ను ఆయన సొంతం.
ఇక రెండో వ్యక్తి కొంత కాలం పాటు కేసీఆర్ సన్నిహితుల్లో ఒకరిగా మెలగి తరువాత దారుణంగా నిర్లక్ష్యానికి గురైన నేత. ఆ సామాజికవర్గం నుంచే తెలంగాణకు మొదటి సీఎం అవుతారని కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి చెప్పినా కూడా తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ తాను వెళ్లి సీఎం సీటులో కూర్చున్నారు. ఆ నేత తండ్రి కూడా తెలంగాణ రాజకీయాల్లో దిగ్గజం. అయితే.. మొన్నటి ఎన్నికలకు ముందు ఆ నేత సొంతంగా పత్రిక స్థాపించడంతో కేసీఆర్ కన్నెర్రకు గురయ్యారు. పూర్తిగా పక్కనపెట్టేశారు.
పత్రికతో పాటు, పేరున్న టీవీ చానల్ కూడా ఉన్న ఆ రెండో నేతను బీజేపీ వాడుకోవాలనుకుంటోంది. ఆయన చేతిలో ఉన్న మీడియాను మరింత బలోపేతం చేసి తెలంగాణలో బీజేపీకి బలమైన గొంతుకగా మార్చి కేసీఆర్‌ను ఇంటికి సాగనంపాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆ నేతను రాం మాధవ్ కలిశారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆయన పత్రికలోకి బీజేపీ నుంచి పెట్టుబడులు వస్తాయని.. పత్రికను మరింత విస్తరించి తెరాస పాలనను ఎండగట్టే పని మొదలుపెడతారని తెలుస్తోంది.