దిశ... మనసు దోచిన ఎర్రన్నాయుడి కొడుకు

May 31, 2020

తెలంగాణతో పాటు యావత్తు దేశాన్నే తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిన దిశ హత్యాచారం... సోమవారం నాటి పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. ఉభయ సభలు రెండింటిలోనూ ఈ అంశంపైనే కీలక చర్చ జరిగింది. చర్చలు ఏ స్థాయిలో జరిగినా... దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై చాలా తక్కువగానే మాట్లాడుతున్నామన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. పోలీసుల అలసత్వం, జనంలో ప్రమాదం నుంచి తప్పించుకునే దిశగా ఉండాల్సిన అవగాహన, బాధిత కుటుంబానికి సంబంధించిన విషయాలు, మృగాళ్లకు పడాల్సిన కఠిన శిక్షలపైనే అంతా చర్చించుకుంటున్నాం. అయితే ఈ తరహా చర్చలతో పెద్దగా ఉపయోగం లేదన్న మాట కూడా అందరికీ తెలిసిందే. 

అయితే మరి ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాలంటే... ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇందులో ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? పౌరులుగా మన బాధ్యతలు ఏమిటి? ఏలా నడుచుకుంటే... దిశ ఘటనలు రిపీట్ కాకుండా ఆపొచ్చు?... ఇలా చాలా ప్రశ్నలే వినిపిస్తున్నా... వాటికి పరిష్కారాలు మాత్రం ఠక్కున గుర్తుకు రావడం లేదు. ఈ తరహా పరిస్థితిపై చాలా వేగంగానే కాకుండా పిన్ పాయింట్ గా స్పందించిన టీడీపీ దివంగత నే కింజరాపు ఎర్రన్నాయుడి కుమారుడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో క్లియర్ కట్ గా స్పందించారనే చెప్పాలి. ట్విట్టర్ వేదికగా రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

సదరు ట్వీట్ లో రామ్మోహన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘నాకు భయమేస్తోందని దిశ చేసిన వ్యాఖ్యలతో మనం ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగాల్సిందే. కఠిన చట్టాల అమలు కంటే కూడా ముందుగా బాల్య దశ నుంచే లింగ సమానత్వంపై చర్చ జరగాలి. అది కూడా అత్యవసరంగా ఈ చర్చ జరగాల్సిందే. ఇదే అంశాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావిస్తాను’ అంటూ పిన్ పాయింట్ గా రామ్మోహన్ స్పందించారు. నిజమే... లింగ సమానత్వాన్ని పక్కనపెట్టేసి... ఎంత కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చినా ఫలితం శూన్యమే కదా. లింగ సమానత్వాన్ని పక్కనపెట్టి మిగిలిన చర్యలపై దృష్టి సారించడమంటే... నేల విడిచి సాము చేయడమే కదా. ముందుగా సమాజంలో లింగ సమానత్వం వస్తే... దిశ తరహా ఘటనలు పునరావృతం మాటే వినపడదు కదా. హ్యాట్సాప్ రామ్మోహన్.... కీపిటప్ అండ్ కీప్ గోయింగ్.