రామ్మోహన్ నాయుడి అదిరే స్పీచ్... సోనియా బల్లలు చరిచారు

July 06, 2020

టీడీపీ యువ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సత్తా కలిగిన నేత. పార్లమెంటులో అయినా, బహిరంగ సభలో అయినా రామ్మోహన్ మైక్ అందుకున్నారంటే... పిన్ డ్రాప్ సైలెన్స్ గా అంతా ఆసాంతం వినాల్సిందే. వాడీ వేడీ పదాలతో విషయంపై సూటిగా సుత్తి లేకుండా... తెలుగు, ఇంగ్లీష్ తో పాటు హిందీలోనూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడే రామ్మోహన్.. గత పార్లమెంటు సమావేశాలను ఓ ఊపు ఊపిన విషయం ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడికి తగిన కొడుకుగా తనదైన శైలిలో రాణిస్తున్న రామ్మోహన్.. సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో మరోమారు సత్తా చాటారు. రామ్మోహన్ స్పీచ్ తో లోక్ సభ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ గా వింటూ ఉండగా... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏకంగా బల్లలు చరుస్తూ... రామ్మోహన్ కు మద్దతు తెలిపిన వైనం చూస్తే.. రామ్మోహన్ ఏం రేంజిలో మాట్లాడారో ఇట్టే స్పష్టమవుతోంది.

తెలంగాణలో దారుణ హత్యాచారానికి గురైన దిశ ఘటనపై చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ప్రసంగించిన రామ్మోహన్... ఆపద సమయంలో దిశ తన సోదరితో వ్యక్తం చేసిన భయాందోళనను ప్రస్తావించిన రామ్మోహన్... దిశ మాటలు విన్న తర్వాత ఇక ఎంతమాత్రం ఆసల్యం చేయకుండా మనమంతా రంగంలోకి దిగిపోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఈ తరహా పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలన్న విషయంపైనా గుక్క తిప్పుకోకుండా మాట్లాడిన రామ్మోహన్... బాల్య దశ నుంచే  లింగ సమానత్వం కనిపించేలా చర్యలు చేపట్టాలని తనదైన శైలి పరిష్కారాన్ని చూపారు. లింగ సమానత్వాన్ని పక్కనపెట్టేసి ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఇలా దిశ ఘటన జరిగిన తీరు, అది మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను నాన్ స్టాప్ గా ఓ రేంజిలో రామ్మోహన్ మాట్లాడుతుంటే... లోక్ సభ సభ్యులంతా అలా వింటూ ఉండిపోయారు. అయితే రామ్మోహన్ నోట నుంచి ఇలా అనర్గళంగా పరిష్కారాలు దూసుకువస్తూ ఉంటే... వైరి వర్గానికి చెందిన ఎంపీ మాట్లాడుతున్నారన్న విషయాన్ని కూడా మరిచిపోయిన సోనియా గాంధీ... రామ్మోహన్ వైపు మెస్మరైజింగ్ గా చూస్తూ... తన ముందున్న బల్లను చరుస్తూ తన మద్దతును ప్రకటించారు. రామ్మోహన్ ప్రసంగానికి ముగ్ధురాలై... బల్ల చరుస్తున్న సోనియా గాంధీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.