ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు - నరసింహన్ సేఫ్

July 12, 2020

దేశంపై పట్టు బిగించడానికి బీజేపీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. 2019 ఎన్నికల్లో అప్రహతిహత విజయాన్ని అందుకున్న బీజేపీ, ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి వీలైన అన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా గవర్నర్ల వ్యవస్థపై దృష్టిపెట్టింది. ఈ రోజు ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. మొన్ననే ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించిన విషయం తెలిసిందే. ఏపీ గవర్నర్ బిష్వభూషన్ సీనియర్ బీజేపీ నేత.
తాజాగా రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా, ముగ్గురు గవర్నర్లను బదిలీచేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్‌ఖార్‌ను, త్రిపుర గవర్నర్‌గా రమేష్ బాయిస్ నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్ పటేల్... ఉత్తరప్రదేశ్ కు పంపారు. బీహార్ గవర్నర్‌గా ఉన్న లాల్ జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. బీహార్ గవర్నర్‌గా ఫాగు చౌహాన్‌ను, నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్.ఎన్.రవి ని నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు.
గవర్నర్లుగా అన్ని పార్టీలు తమ పార్టీలోని సీనియర్లను నియమిస్తు వస్తున్నాయి. బీజేపీ కూడా అదే దారిలో నడిచింది. పార్టీ క్లిష్టపరిస్థితుల్లో గాని, పార్టీ ఎదుగుదలకు గాని గవర్నర్ సాయాన్ని పొందుతుంటాయి. తాజాగా కర్ణాటక ఎపిసోడ్ లో కోర్టుల్లో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమికి ఊరట కలిగినా గవర్నర్ జోక్యంతో బీజేపీ పై చేయి సాధిస్తోంది. అందుకే జాతీయ పార్టీలు గవర్నర్ల వ్యవస్థను పక్కాగా సద్వినియోగం చేసుకుంటాయి.
ఇదిలా ఉండగా... తెలంగాణ ప్రజలు గవర్నర్ నరసింహన్ ను ఇంకొంతకాలం భరించక తప్పదు. ఇప్పటికే దశాబ్దం పూర్తి చేసుకున్న నరసింహన్ మరోసారి తన పట్టు నిలుపుకుని తెలంగాణ గవర్నర్ గానే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ చేత నియామకమై బీజేపీ ప్రేమ పొందిన ఏకైక గవర్నర్ ఈయనే. పైగా మొన్నటి వరకు రెండు రాష్ట్రాల హోదాను అనుభవించారాయన.