హర్టయినట్టున్నాడు - జగన్ కి దీక్షితులు అల్టిమేటం

August 10, 2020

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ డైమండ్ ఫేం రమణ దీక్షితులకు తిరుమలలో పెద్ద పీట వేశారు. మంచి మనిషి లక్షణం ఇతరులను ద్వేషించకపోవడమే. కానీ చంద్రబాబుపై నిలువెల్లా రగిలిపోయిన రమణదీక్షితులు బాబుపై కోపంతో వైసీపీ చెంతన చేరారు. ఇపుడు కూడా తిరుమలలో తాను చెప్పిందే జరగాలి అనుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా, భక్తులకు అందాల్సిన సేవల పరంగా సలహాలు ఇవ్వడానికి ఆయనకు పదవి ఇస్తే తాను పూర్వాశ్రమంలో వ్యవహరించినట్టే వ్యవహరిస్తున్నారు.

ఈవోతో పాటు పలువురి మీద ఆరోపణలు చేశారు. అది కూడా ట్విట్టరులో, మీడియా ముందు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మొదటి వార్నింగ్ కింద రమణ దీక్షితులు ద్వేషించిన వ్యక్తి పదవీ కాలాన్ని జగన్ పొడిగించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేత రాజకీయాలు చేయొద్దని వార్నింగ్ కూడా ఇప్పించారు. 

దీనికి రమణ దీక్షితులు బాగా హర్టయినట్టున్నారు. ఇంతకాలం జగన్ కే ట్వీట్లు వేసి సలహాలిచ్చిన దీక్షితులు ఇపుడు సుబ్బారెడ్డికి కూడా ట్యాగ్ చేసి తిరుమలలో అల్టిమేటం జారీ చేస్తున్నారు. 

 ‘శ్రీవారి అర్చకుల స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం సబబు కాదు. శ్రీవారి ఆరాధన సేవలు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదు. శ్రీవారి సన్నిధిలో కైంకర్యాలు నిలిచిపోవడం మానవాళికి ఏమంత మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో కొన్ని వారాల పాటు దర్శనాలు నిలిపివేయాలి. శ్రీవారికి సేవ చేస్తున్న అర్చకులను రక్షించుకోవాలి. స్వామివారికి ఏకాంతంలో పూజాధికాలు నిర్వహించాలి. దీనిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తగు నిర్ణయం తీసుకోవాలి’ అంటూ ఆయన తాజాగా సంచలన ట్వీట్ వేశారు. ట్విట్టరులో రాజకీయాలొద్దు. ఏదైనా ఉంటే ప్రైవేటుగా చెప్పండి అన్న మాటలను ఆయన లెక్కచేయలేదు. మొత్తానికి రఘురామరాజు స్ఫూర్తితో ముందుకు పోవాలని డిసైడైనట్టున్నారు.