సాయిరెడ్డి హవా... ఢిల్లీలో అసిస్టెంట్ గా ఉన్నతాధికారి, పైగా రెడ్డి

July 01, 2020

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? నిజమే... రాజు తలచుకుంటే దెబ్బలకేం ఖర్మ. ఇంకేమైనా చేయొచ్చు. నిబంధనలకు తూట్ల పొడవొచ్చు. గిట్టని వారిని శంకర గిరి మాన్యాలక పంపొచ్చు. అస్మదీయులను అక్కున చేర్చుకోనూ వచ్చు. ఈ అక్కున చేర్చకోవడాలను నిబంధనలకు విరుద్ధంగానూ కొనసాగించవచ్చు. అయినా అడిగే వారికి సమాధానం చెప్పాల్సిన గురుతర బాధ్యత లేని వారికి ఇక నిబంధనలు ఏం గుర్తుకొస్తాయి చెప్పండి. నిజమే... పాలన అంటే ప్రజా సేవ అని గుర్తున్న వారికే నిబంధనలు గుర్తుకు వస్తాయి. అందుకు భిన్నంగా వ్యవహరించే వారికి నిబంధనలు గుర్తుకు రావు కదా. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదీ అదేనన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.

సరే... అసలు విషయానికి వస్తే... రాజ్యసభలో వైసీపీ ఎంపీగా, వైసీపీ పార్లమెంటరీా పార్టీ నేతగా కొనసాగుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు కదా. జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు సాయిరెడ్డి... ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ నియమితులయ్యారు. సాయిరెడ్డి నియామకం చెల్లదని వైరివర్గాలు కోర్టుకెక్కగా... కాస్త వెనకడుగు వేసినట్టే కనిపించిన జగన్... మళ్లీ ఆయనను అదే పదవిలో నియమించేశారు. అంతటితో ఆగారా? లేదనే చెప్పాలి. ఢిల్లీలో సాయిరెడ్డికి ఓ అసిస్టెంట్ ను నియమించేశార. అసిస్టెంట్ అంటే ఏ టైప్ రైటరో, స్టెనోనో, కంప్యూటర్ ఆపరేటరో, పర్సనల్ అసిస్టెంటో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే... సాయిరెడ్డికి అసిస్టెంట్ గా నియమితులైన అధికారి ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (ఐఆర్పీఎస్) కు చెందిన ఉన్నతాధికారి. పేరు రమణారెడ్డి.

పేరులో తోక ఉంది కదా. పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే... జగన్ అధికారంలోకి వచ్చాక కీలక పదవులు, పోస్టులన్నింటిలో ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కూర్చుంటున్నారు కదా. సో... సాయిరెడ్డికి అసిస్టెంట్ గా రమణారెడ్డి నియామకంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. అదేంటంటే... సాయిరెడ్డికి అసిస్టెంట్ గా రమణారెడ్డిని నియమిస్తున్నట్లుగా జగన్ సర్కారు ఎక్కడా చిన్న మాట చెప్పలేదు. చిన్నపాటి జీవో కూడా జారీ చేయలేదు. మరెలా? ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేక కమిషనర్ గా రమణారెడ్డిని నియమించిన జగన్ సర్కారు... ఆ పదవిలో కొనసాగుతూనే సాయిరెడ్డికి అసిస్టెంట్ గా పనిచేయాలని రమణారెడ్డికి చెప్పిందట.

అసలే సొంత సామాజిక వర్గం.... ఆపై సీఎం తర్వాతి స్థాయి....ఎప్పుడనుకుంటే అప్పుడు పీఎం నరేంద్ర మోదీతో కలిసే ఛాన్సున్న సాయిరెడ్డికి అసిస్టెంట్ గా అంటే... ముందూవెనునకా చూడకుండా రమణారెడ్డి ఎగిరి గంతేశారట. సరే... అధికారికంగా రమణారెడ్డికి అప్పగించిన పోస్టేమైనా... ప్రస్తుతం తానుంటున్న పోస్టు కంటే ఎక్కువా? అంటే... అదీ కాదు. దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ పర్సనల్ ఆఫీసర్ గా కొనసాగుతున్న రమణారెడ్డి... ఇకపై ఆ పోస్టు కంటే తక్కువ కేడర్ కలిగిన ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ గా కొనసాగుతారట. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ గా రమణారెడ్డిని నియమించిన జగన్ సర్కారు... సాయిరెడ్డికి అసిస్టెంట్ గా పనిచేయాలన్న విషయాన్ని జీవోలో పేర్కొననని వైనంపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.