మెడలు వంచడమంటే ఇదీ: కేంద్రాన్ని కడిగిపారేసిన టీడీపీ యువ ఎంపీ

June 01, 2020

నవ్యాంధ్రపై శీతకన్నేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై టీడీపీ యువనేత, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు నిజంగానే బోనులో నిలబెట్టేసినంత పనిచేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి లోక్ సభ సమావేశాల్లో మైకందుకున్న రామ్మోహన్ నాయుడు... పదే పది నిమిషాల్లో ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న సవతి తల్లి ప్రేమను బయటపెట్టేశారు. ఇతర రాష్ట్రాల కంటే కూడా కాస్తంత ఎక్కవ దృష్టి సారించాల్సి ఉన్న ఏపీకి కేంద్రం ఇతోదికంగా నిధులు ఇవ్వాల్సి ఉన్నా,... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు... ఏపీ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని పంపుతోందని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. అసలెందుకీ వివక్ష అంటూ రామ్మోహన్ సంధించిన ప్రశ్నలతో లోక్ సభ పిన్ డ్రాప్ సైలెన్స్ మారింది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ సహా... సభలోని అన్ని పార్టీల సభ్యులు... రామ్మోహన్ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా గమనించారు. 

రామ్మోహన్ నాయుడు తన ప్రసంగంలో ఏఏ అంశాలను ప్రస్తావించారన్న విషయానికి వస్తే... తెలుగు నేల విభజన తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఇప్పటికీ కేంద్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నారని, అయితే ఇప్పటిదాకా 8 బడ్జెట్లను ప్రవేశపెట్టిన మోదీ సర్కారు... ఒక్కటంటే ఒక్క బడ్జెట్ లోనూ ఏపీకి కనీస కేటాయింపులు కూడా చేయలేదని విరుచుకుపడ్డారు. ఏపీ పునర్విభన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనా.. తీసుకురావాల్సిన బాధ్యత వైసీపీపైనా ఉందని ఆయన చెప్పారు. పార్లమెంటులో 24 మంది సభ్యులున్న వైసీపీ ఈ విషయంలో ఎందుకు నిర్లిప్తంగా ఉందో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. 15 ఆర్థిక సంఘం ప్రస్తావన కూడా తీసుకువచ్చిన రామ్మోహన్.. ఏపీకి ప్రకటించిన ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల ఏర్పాటుపైనా దృష్టి సారించడం లేదని ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ను ఏం చేశారని కూడా రామ్మోహన్ నిలదీశారు. 

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన చాలా జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని, అందులో ఏపీకి చెందిన 7 జిల్లాలు ఉన్నాయని ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు... మిగిలిన రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాలకు బీఆర్ జీఎఫ్ నిధులను ఇచ్చిన కేంద్రం ఏపీలోని జిల్లాలకు ఎందుకు ఆ నిధులను విడుదల చేయలేదని నిలదీశారు. రైల్వే జోన్ విషయంలోనూ ఏపీ పట్ల కేంద్రం సాచివేత ధోరణిని అవలంబిస్తోందని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించినా... ఇప్పటిదాకా చిల్లి గవ్వ కూడా విదల్చలేదని ధ్వజమెత్తారు. ఇదే తరహా ధోరణితో కేంద్రం ముందుకు సాగితే... ఏపీ ఎప్పుడు కోలుకుంటుందని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. పన్నుల వాటాలలోనూ కేంద్రం ఏపీ పట్ల శీతకన్నేసిందని, ఒక్క ఏపీ పట్లే కాకుండా మొత్తం దక్షిణ భారతంపైనే కేంద్రం శీతకన్నేసినట్టుగా కనిపిస్తోందని కూడా రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్లమెంటు సీట్ల సంఖ్య పెంపు విషయంలోనూ కేంద్రం దక్షిణ భారతానికి నష్టం చేకూర్చే విధంగానే వ్యవహరిస్తోందని రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. మొత్తంగా మాట్లాడింది పది నిమిషాలే అయినా.. ఏపీపై శీతకన్నేసిన మోదీ సర్కారును రామ్మోహన్ నాయుడు దాదాపుగా బోనులో నిలబెట్టేసినంత పనిచేశారని చెప్పాలి.