రూ.5.7 కోట్ల కేసుపై రామ్మోహన్ నాయుడు ట్విస్ట్, ఒంగోల్లో టెన్షన్

August 05, 2020

పదిరోజుల క్రితం మంత్రి బాలినేని స్టిక్కర్ ఉన్న వాహనంలో ఒంగోలుకు చెందినవారు.. రూ.5.27 కోట్లను ఒంగోలు నుండి చెన్నైకి తరలిస్తూ తమిళనాడు చెక్ పోస్ట్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఇధి ఏపీలో అవినీతి సొమ్ముగా చెబుతూ, చెన్నై నుండి హవాలా మార్గంలో తరలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ పట్టుబడిన నిధులపై తేల్చాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈడీకి లేఖ రాశారు.

దీనిని మనీ లాండరింగ్, పీఎంఎల్ఏ కింద విచారణ జరపాలని కోరారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

తమిళనాడులో పట్టుబడిన రూ.5.7 కోట్లపై దర్యాఫ్తును ప్రారంభించింది. తమిళనాడు పోలీసులు ఈ నగదును అరంబక్కంలోని ఎలావురు చెక్ పోస్ట్ వద్ద జూలై 15వ తేదీన సీజ్ చేశారు.

కారులో ఉన్న ప్రయాణీకులను వసంత్, లక్ష్మీనారాయణలు, డ్రైవర్‌ను నాగరాజుగా గుర్తించారు.

ఈ నగదుకు సంబంధించి ముగ్గురు కూడా ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు ఈ నగదును అప్పగించారు.

ఈ కారు జగన్ బంధువు, ఏపీ మంత్రి బాలినేనికి చెందినదని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈడీకీ లేఖ రాశారు.

మనీలాండరింగ్ కింద దర్యాఫ్తు చేయాలని కోరారు. దీంతో దర్యాఫ్తు ప్రారంభమైంది.

ఈ మొత్తం తనదిగా చెప్పిన నగల వ్యాపారికి ఐటీ శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది.

గత ఏడాది కాలంగా చెన్నై, బెంగళూరు నగరాల నుండి హవాలా మార్గంలో రూ.1200 కోట్ల వరకు నల్లధనాన్ని మారిషస్ పంపిస్తున్నారని, ఇందులో ఇప్పుడు దొరికిన రూ.5.27 కోట్లు చాలా చిన్నమొత్తమని మాజీ మంత్రి నారా లోకేష్ తన ట్వీట్‌లో ఆరోపించారు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇందులో పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలను బాలినేని కొట్టి పారేస్తున్నారు. ఒంగోలుకు చెందిన నల్లమల్లి బాలు అనే నగల వ్యాపారి ఈ మొత్తం తనదిగా చెబుతున్నారని, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తీసుకు వెళ్తున్నట్లు చెప్పారని అంటున్నారు.

ఈ కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇందులో తన పాత్ర ఉందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు.

కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చిందో తెలియదని చెబుతున్నారు.