రంగంలోకి రామోజీ : ఆనందంలో రైతులు, డిఫెన్స్ లో వైసిపి

August 06, 2020

తెలుగులో అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన ఈనాడు దినపత్రిక రాజధాని విషయంలో ఒక స్టాండ్‌ తీసుకుని దానికి అనుగుణంగా వార్తలను కుమ్మేస్తుంది. అప్పుడెప్పుడో మద్యపాన నిషేదం ఉద్యమాన్ని నెత్తినవేసుకుని ఈనాడు ముందుండి నడిపించింది. ఆ తరువాత ఆ స్థాయిలో ఇప్పుడు రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమ తరహాలో వార్తలను రాస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల విషయం ప్రకటించిన దగ్గర నుంచి ఈనాడు దానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించింది.

గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ లోనూ ఈనాడు దేనికి మద్దతుగా కానీ, వ్యతిరేకంగా కానీ వ్యవహరించ లేదు. దూరదర్శన్‌ తరహాలో అక్కడేం జరిగిందో చెబుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈనాడు అదే రీతిలో వ్యవహరించింది. సమైక్యాంధ్రప్రదేశ్‌కు కానీ, లేదా ప్రత్యేక తెలంగాణకు కానీ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఆంధ్రా మూలాలు ఉన్న రామోజీరావు రెండు పక్షాలతో ఇబ్బందులు రాకుండా వ్యవహరించారు. అయితే ఇప్పుడు మాత్రం రాజధాని తరలింపు విషయంలో ఈనాడు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, స్పష్టంగా చెబుతోంది. రాజధానిని మార్చడం సరికాదని, దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ప్రజలకు ఎంత కీడు జరుగుతుందో వివరంగా చెబుతూ, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తోన్న రైతులకు, ఇతర వర్గాలకు మద్దతు ఇస్తోంది.

అమరావతి నుంచి రాజధానిని మార్చాలని జగన్‌ నిర్ణయం తీసుకోగానే ముందుగా ఈనాడు తన పత్రిక విషయంలో కొన్ని మార్పులు చేసుకుంది. ఈనాడు స్థాపించిన దగ్గర నుంచి దానికి ఎడిటర్‌గా ఉన్న చెరుకూరి రామోజీరావును తొలగించి ఆయన స్థానంలో ఎం. నాగేశ్వర రావును ఎడిటర్‌గా చేసింది. అదే సమయంలో రామోజీరావును ఈనాడు పౌండర్‌గా పేర్కొంది. రామోజీరావును ఎడిటర్‌గా పక్కన పెట్టిన తరువాత రాజధాని విషయంలో ఈనాడు చెలరేగిపోతోంది. రాజధాని విషయంలో ఈనాడు స్పష్టమైన స్టాండ్‌ తీసుకుని దానికి మద్దతు వార్తలు కుమ్మేస్తోంది. మొన్నటి దాకావైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించిన ఈనాడు ఇప్పుడు ఆ భేషజాలను పక్కన పెట్టి రాజధాని విషయంలో రైతులకు మద్దతు ప్రకటించింది. రాజధానిలో గత ఐదేళ్లల్లో ఎంత అభివృద్ధి చెందిందిఎంత మేరకు పనులు జరిగాయి ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టారు. అనే విషయాలతో పాటు రాజధానికి సంబంధించిన స్పష్టమైన సమాచారంతో రోజుకో పేజీ ప్రత్యేకంగా కేటాయించి వార్తలను గుప్పిస్తోంది. ఇప్పటి వరకు రాజధానిలో ఏమి జరిగిందో సరిగా తెలుకోలేని వారుకూడా తాజాగా ఈనాడు ఇస్తోన్న సమాచారంతో ఆశ్చర్యపోతున్నారు. విశాఖకు రాజధానిని మారిస్తే అది ఇతర ప్రాంతాలకు ఎంత దూరంలో ఉంటుందోఎన్ని నియోజకవర్గాలకు అందుబాటులో లేకుండా పోతుందోతెలుపుతూదాని గురించి స్పష్టమైన మ్యాప్‌లతో ప్రకటించింది. ఇది చూసిన తరువాతకొంత మంది వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అదే విధంగా రాజధాని అమరావతిలో టిడిపి ప్రభుత్వం నిర్మించిన అసెంబ్లీ, సచివాలయ భవానాల గురించి, దానికి చేసిన ఖర్చు గురించి, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ గురించి, ఐఎఎస్‌ అధికారుల బంగాళాలు, హైకోర్టు, న్యాయమూర్తుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మంత్రుల నివాసాలు, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన, నిర్మిస్తోన్న వివరాలతో పాటు రాజధానిలో నిర్మించిన 100 కిలో మీటర్ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు గురించి ప్రముఖంగా ప్రచురించింది.

అదే విధంగా విజయవాడ-గుంటూరుల మధ్య ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన ఆర్థికనడవా గురించి, అక్కడ పెట్టిన పెట్టుబడులపై ప్రత్యేక పేజీను ప్రచురించింది. ఇదే కాకుండా రాజధాని మార్పు వల్ల జరిగే ఆర్థిక నష్టం గురించి విపులంగా ప్రత్యేక వ్యాసాలను ఇస్తోంది. ఈనాడు ఏమి రాసుకున్నా మాకెందుకు? దానిపై కులముద్ర వేశామని అదేమి రాసినా ఇబ్బంది రాదనుకున్న ప్రభుత్వ పెద్దలు తాజాగా ఈనాడు లేవనెత్తుతోన్న అంశాలపై తన స్వంత పత్రికలో వివరణ రాసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. ఈనాడు లేవనెత్తే అంశాలు సామాన్య ప్రజలకు నేరుగా తాకు తుండడంతో ప్రభుత్వంలో సెగ పుడుతోంది.

దీనిపై మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఇవేం రాతలు తన సామాజి కవర్గానికి ఇబ్బంది కలుగుతుంది కనుక ఈనాడు ఈ విధంగా రాస్తోందని, విమర్శలు కురిపించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ఈనాడు వార్తలపై కలవరం చెందినా ముఖ్యమంత్రి మనస్సు తెలుసును ఏమీ చేయలేక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మొత్తం మీద రాజధాని మార్పుపై ఈనాడు ఇస్తోన్న కవరేజీ అధికారపార్టీకి చికాకులు సృష్టిస్తున్నాయనడంలో సందేహం లేదు.

మరోవైపు ఈనాడు ఇస్తోన్న మద్దతుతో రాజధాని రైతులు, ప్రతిపక్షాలు ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.